డీఎస్సీ.. వివాదమా.. రాజ‌కీయమా.. ?

కానీ, అధికారంలోకి వ‌చ్చిన ఐదేళ్ల‌లో ఒక్క పోస్టును కూడా భ‌ర్తీ చేయ‌లేదు. కేవ‌లం స‌చివాల‌యాల్లో కార్య దర్శుల‌ను, వాలంటీర్ల‌ను మాత్ర‌మే నియ‌మించారు.

Update: 2026-05-30 23:30 GMT

ఏపీలో తాజాగా వెలుగులోకి వ‌చ్చిన డీఎస్సీ వివాదం వెనుక‌.. నిజంగానే వివాదం ఉందా? లేక ఇది రాజ కీయంగా మారిందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. దాదాపు నాలుగు మాసాల కింద‌ట కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మెగా డీఎస్సీ నియామ‌కాలు.. దాదాపు 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. చ‌రిత్ర సృష్టించాయి. వైసీపీ హ‌యాంలో డీఎస్సీ వేస్తామ‌ని.. దాదాపు 23 వేల మంది టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని.. జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కుముందు ప్ర‌క‌టించారు.

కానీ, అధికారంలోకి వ‌చ్చిన ఐదేళ్ల‌లో ఒక్క పోస్టును కూడా భ‌ర్తీ చేయ‌లేదు. కేవ‌లం స‌చివాల‌యాల్లో కార్య దర్శుల‌ను, వాలంటీర్ల‌ను మాత్ర‌మే నియ‌మించారు. దీనికితోడు ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య‌ను కూడా త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. రిటైర్ అయిన వారి స్థానంలో ఐదేళ్ల‌పాటు ఒక్క‌రినీ భ‌ర్తీ చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే యువ‌గ‌ళం పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. నారా లోకేష్‌కు ఉపాధ్యాయ ఉద్యోగాల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారు.. అనేక విన్న‌పాలు చేశారు.

మొత్తంగా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. 16 వేల పైచిలుకు ఉద్యోగాల‌తో నోటిఫికేష‌న్ ఇచ్చారు. భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను కేవ‌లం 158 రోజుల్లోనే పూర్తి చేశారు. దీనికి ముందే న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌ను కూడా ప‌రిష్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ 16 వేల మందిలో దాదాపు 14 వేల మంది ఉద్యోగాల్లో కూడా చేరిపోయారు. మిగిలిన కొన్నిపోస్టులు బ్యాక్‌లాగ్‌మాదిరిగా మిగిలిపోయాయి. వీటిని కూడా త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్న డీఎస్సీలో భ‌ర్తీ చేస్తారు. అయితే.. నియామ‌కం స‌మ‌యంలో కానీ.. నియామ‌కాలు అయిన త‌ర్వాత‌.. కానీ.. వైసీపీఈ వ్య‌వ‌హారంపై ఎక్క‌డా ప‌న్నెత్తు మాట అన‌లేదు.

అంటే.. అంతా క‌చ్చితంగా పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగింద‌నే క‌దా!. కానీ.. ఇటీవ‌ల రెండు విష‌యాల‌తో వైసీపీ దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. 1) క్రీడ‌ల కోటాలో ఉద్యోగాల‌ను అమ్ముకున్నార‌న్న‌ది ప్రధాన వాద‌న‌. అయితే.. ఇది సాధ్యం కాద‌ని ఉద్యోగార్ధులే చెబుతున్నారు. కోర్టు సూచ‌న‌లు, వారికి ఉన్న స‌ర్టిఫికెట్ల ఆధారంగానే వీటిని కేటాయించారు. ఇక‌, 2) డీఎస్సీ.. పేప‌ర్ త‌యారు చేసిన సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగి ఒక‌రికి పోస్టు ద‌క్కింది. దీనిని కూడా వైసీపీ రాజ‌కీయం చేసింది.

వాస్త‌వానికి పేపరు త‌యారు చేసేది విద్యావంతులు. మేధావులు. అందులో ఉండే ఉద్యోగులు కారు. పైగా.. చిన్న స్థాయి ఉద్యోగికి.. పేప‌ర్ త‌యారు చేసే పాత్ర అప్ప‌గించ‌రు. అంటే.. మౌలికంగా చూస్తే.. స‌ద‌రు ఉద్యోగి.. క‌ష్ట‌ప‌డి ప‌రీక్ష రాసి విజ‌యం ద‌క్కించుకున్నాడ‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది. ఇక‌, ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో ఏమైనా లోపం ఉందా? అంటే.. లేద‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు. సో.. ఇలా ఏ కోణంలో చూసినా.. డీఎస్సీ వివాదం కేవ‌లం రాజ‌కీయం త‌ప్ప‌.. మ‌రొక‌టి కాద‌ని.. మేధావులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌ద్వారా వైసీపీ ల‌బ్ధి పొందాల‌న్న ఏకైక అజెండానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News