వార్ వన్ సైడ్ అంటున్న టీడీపీ... మరి వైసీపీ ?
ఇక ప్రతిపక్ష వైసీపీ అయితే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెబుతోంది. ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీని మీద మాట్లాడుతూ లోకల్ బాడీస్ లో వైసీపీ పోటీ చేసి తన సత్తా చాటుతుందని అన్నారు.;
వార్ ఎపుడూ వన్ సైడే. రాజకీయాల్లో అయితే అది ఎత్తులు పై ఎత్తులతో ముందుకు పోయిన వారినే వరిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తే టీడీపీ కూటమికి ఈ విషయాల్లో కొరత లేదు. అపర చాణక్యుడుగా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలో ఉన్నారు. కూటమి పెద్దగా ఆయన అన్నీ పర్యవేక్షిస్తారు, ముందుకు నడిపిస్తారు. అధికారం కూడా చేతులలో ఉంది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే కూటమిని నల్లేరు మీద నడక తరహాలోనే ఉంటాయని అంటున్నారు. అయితే ఏపీలో విపక్షం కూడా ఉంది. అదే వైసీపీ. ఆ పార్టీ కూడా 2021లో వార్ వన్ సైడ్ అంటూ లోకల్ బాడీస్ లో నూటికి తొంబై శాతం పైగా రాబట్టుకుంది. ఇపుడు కేవలం 11 సీట్లకే పరిమితమై చతికిలపడింది. మరి వైసీపీ స్థానిక పోరులో నిలబడుతుందా, ఆ పార్టీ స్ట్రాటజీ ఏమిటి అన్న దాని మీద చర్చ సాగుతోంది.
గెలిచి తీరాలన్న టీడీపీ :
స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో జరగబోతున్నాయని పార్టీలో ఉన్న ప్రతీ ఒక్క బాధ్యులూ గట్టిగా పనిచేయాలని చంద్రబాబు టీడీపీ రాష్ట్ర జాతీయ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు. ప్రతీ ఒక్కరూ కష్టించి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. వార్ వన్ సైడ్ కావాలని కూడా బాబు గట్టిగా కోరారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెర లేస్తుంది అన్న ప్రచారం సాగుతున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో కూటమి లక్ష్యాలు ఏమిటో తేటతెల్లమయ్యాయని అంటున్నారు.
పోటీకి సిద్ధం :
ఇక ప్రతిపక్ష వైసీపీ అయితే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెబుతోంది. ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీని మీద మాట్లాడుతూ లోకల్ బాడీస్ లో వైసీపీ పోటీ చేసి తన సత్తా చాటుతుందని అన్నారు. ఆయన చెప్పడం ఓకే అయినా వైసీపీ ఇంతవరకూ ఆ దిశగా యాక్షన్ ప్లాన్ ని రూపొందించిందా అన్నదే చర్చగా ఉంది. నిజానికి కూటమికి మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల కేటాయింపు సర్దుబాట్లు ఇతరత్రా వ్యవహారాలు చాలా ఉంటాయి. పైగా ప్రభుత్వాన్ని నడపాల్సి కూడా ఉంటుంది. కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఎన్నికలు ఎపుడా అని చూడాల్సిన పార్టీ అది. మరి స్థానిక సంస్థలకు ఎన్నికలు అంటే వైసీపీ క్యాడర్ కి ఒక చాన్స్ అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలోపేతం కావడానికి కూడా ఆస్కారం కల్పించే ఎన్నికలు అంతే కాకుండా క్యాడర్ గట్టిగా నిలబడి అధికార పార్టీ మీద పోరాడేందుకు కూడా వీలు కల్పించే ఎన్నికలు. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఎన్నికల విషయంలో వైసీపీ వ్యూహాలు ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.
నాటి సీన్ రిపీట్ :
వెనక్కి ఒక్కసారి వెళ్తే 2021లో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేసింది. దాని వెనక అధికారం అండగా ఉందని విమర్శలు వినిపించాయి. ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా అంతా తామే అయి నడిపించారు అని కూడా నాటి విపక్షాలు విమర్శించాయి. మరి ఆనాడు అధికారం వైసీపీ చేతిలో ఉంది. నల్లేరు మీద నడకలా అంతా సాగిపోయింది. ఇపుడు పవర్ కూటమి చేతిలో ఉంది. దాంతో కూటమికి కూడా అదే చాన్స్ దక్కబోతోందా అన్న చర్చ సాగుతోంది. అంటే మొత్తానికి మొత్తం స్థానిక సంస్థలలో సీట్లను కూటమి పార్టీలు కైవశం చేసుకుంటే బొమ్మ తిరగబడినట్లే. మరి వైసీపీ ఏ మేరకు నిలువరిస్తుంది. ఎంత మేరకు తన ఉనికిని చాటుకుంటుంది అన్నదే స్థానిక ఎన్నికల్లో చూడాల్సిన చిత్రమని అంటున్నారు.