జగన్ చెప్పింది వినడమే పాపమా?: సంజయ్ ఆవేదన
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.;
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదని.. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని..తన ఉద్యోగ జీవితమే చెబుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారులు ఆయనను విచారిస్తున్నారు.
ఏంటీ కేసు..
జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సంజయ్ వ్యవహరించారు. దీంతో పాటు.. ఆయన ఫైర్ డిపార్ట్‌మెం టు ఐజీగా కూడా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ సంజయ్ వేశారన్న చర్చ అప్పట్లో సాగింది. అయితే.. దీనిపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు ఆదేశాలను మాత్రమే తాము పాటించామని సంజయ్ గతంలోనే వివరణ ఇచ్చారు. చంద్రబాబు పట్ల తనకు మంచి అభిప్రాయం కూడా ఉందన్నారు.
ఇక, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నసమయంలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే ఇప్పుడు కేసు నమోదై.. విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం రోజుల కిందట.. ఏసీబీ కోర్టులో లొంగిపోయిన.. సంజయ్‌ను అధికారులు విచారణకు తీసుకున్నారు. ఈ విచారణ మూడు రోజుల పాటు సాగనుంది. తొలి రోజు మంగళవారం.. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించిన అనంతరం.. ఆఫీసుకు తీసుకువెళ్లి టీ ఇచ్చారు. ఈ సమయంలోనే సంజయ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
``మీరైనా నేనైనా.. ప్రభుత్వం చెప్పినట్టే కదా చేయాలి.`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను తప్పు చేయలేదని.. కావాలంటే..తన ఇల్లు ఆస్తులను కూడా తనిఖీ చేసుకోవచ్చని తేల్చి చెప్పినట్టు తెలిసింది. అవినీతి చేసి ఉంటే.. అసలు కేసులు చుట్టుముట్టేవి కాదన్నారు. జగన్ చెప్పినట్టు విన్నానని.. అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశిస్తే.. మీరు మాత్రం చేయకుండా ఉంటారా? అని చెప్పినట్టు తెలిసింది. అయితే..కేసుకు సంబంధించిన విషయాలపై మాత్రం తనకు తెలియదని.. తాను రూపాయి కూడా తినలేదని చెప్పుకొచ్చారు.