జ‌గ‌న్‌కు షాక్‌.. బాబుకు జోష్‌: ఇక‌, రైట్ రైట్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను కొత్త‌గా తీసుకువ‌చ్చారు. వీటిలో 5 కాలేజీ ల‌ను మాత్ర‌మే వైసీపీ హ‌యాంలో పూర్తి చేశారు.;

Update: 2025-10-09 04:44 GMT

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. అదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌వ‌చిస్తున్న ప్రైవేటు మంత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. గ‌త నెల రోజులుగా రాష్ట్రంలో తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన‌.. మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారంపై ఏపీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీంతో జ‌గ‌న్ శిబిరం మూగ‌బోగా.. కూట‌మి నాయ‌కులు జోష్‌లో మునిగితేలుతున్నారు. ఇక‌, త‌మ నిర్ణ‌యానికి తిరుగు లేద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

విష‌యం ఏంటి?

ఏపీలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను కొత్త‌గా తీసుకువ‌చ్చారు. వీటిలో 5 కాలేజీ ల‌ను మాత్ర‌మే వైసీపీ హ‌యాంలో పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఈ కాలేజీల్లో త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. మిగిలిన 12 కాలేజీల్లో 2 క‌ళాశాల‌లు 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రికొంత ప‌నులు పూర్తి చేస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌, మిగిలిన 10 కాలేజీల‌కు పునాదుల ద‌శ కూడా దాట‌లేదు. వీటిని పూర్తి చేయాలంటే.. రాష్ట్ర స‌ర్కారు వాటా కింద 10 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని కూట‌మిప్ర‌భుత్వం చెబుతోంది.

ప్ర‌స్తుతం రాష్ట్ర స‌ర్కారుకు ఉన్న ఇబ్బందుల రీత్యా అంత మొత్తం కేటాయించే ప‌రిస్తితి లేద‌ని చెబుతు న్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ 10 కాలేజీల నిర్మానాన్ని పీపీపీ(ప్రైవేటు-ప‌బ్లిక్‌-పార్ట‌న‌ర్ షిఫ్‌) విధానంలో 33 ఏళ్ల పాటు ప్రైవేటు కు అప్ప‌గించేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే.. దీనిని వైసీపీ త‌ప్పుబ‌డుతోంది. పెద్ద ఎత్తున ఉద్య‌మానికి కూడా రెడీ అయింది. ఇంత‌లో గుంటూరుకు చెందిన డాక్ట‌ర్ వ‌సుంధ‌ర హైకోర్టు ను ఆశ్ర‌యించి.. స‌ర్కారు నిర్ణ‌యాన్ని కొట్టివేయాల‌ని కోరారు.

ఈ పిటిష‌న్‌పై స్పందించిన కోర్టు.. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు కూడా మారుతా యని, పీపీపీ విధానంలో నిర్మాణం మంచిదేన‌ని... పూర్తిగా ప్రైవేటుకు క‌ట్ట‌బెట్ట‌డం లేద‌ని వ్యాఖ్యానించిం ది. అంతేకాదు.. అన్నీ ప్ర‌భుత్వ‌మే చేయాలంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. కోర్టు భ‌వ‌నాల నిర్మాణాలే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంది. ఈ నేప‌థ్యంలో పీపీపీ విధానంలో తాము జోక్యం చేసుకునేది లేద‌ని తెలిపింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని పాజిటివ్ కోణంలో ఆలోచ‌న చేయాల‌ని పేర్కొంది. అన్నింటినీ గుడ్డిగా వ్య‌తిరేకిస్తే.. రాష్ట్రం ముందుకు సాగ‌ద‌ని తెలిపింది. దీంతో జ‌గ‌న్ పెట్టుకున్న ఆశ‌లు వ‌మ్ము కాగా.. చంద్ర‌బాబు స‌ర్కారుకు కొత్త జోష్ వ‌చ్చింది.

ఎక్క‌డెక్క‌డ పీపీపీ విధానం అంటే..

ఆదోని(క‌ర్నూలు జిల్లా)

మ‌ద‌న‌ప‌ల్లె(చిత్తూరు జిల్లా)

మార్కాపురం(పాత ప్ర‌కాశం జిల్లా)

పులివెందుల‌(క‌డ‌ప జిల్లా)

న‌ర్సీప‌ట్నం(ఉమ్మ‌డి విశాఖ‌)

పెనుకొండ‌(ఉమ్మ‌డి అనంత‌పురం)

పాల‌కొల్లు(ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి)

అమ‌లాపురం(ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి)

బాప‌ట్ల‌(ఉమ్మ‌డి గుంటూరు)

పార్వ‌తీపురం మ‌న్యం(ఉమ్మ‌డి విజ‌య‌నగ‌రం)... జిల్లాల్లో వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ప్ర‌భుత్వం నిర్మించ‌నుంది. వీటికి సంబంధించి ఇప్ప‌టికే మ‌ద‌న‌ప‌ల్లె, మార్కాపురం, న‌ర్సీప‌ట్నం, పెనుకొండ‌, బాప‌ట్ల‌ల‌లోని క‌ళాశాల‌ల‌కు టెండ‌ర్లు ఆహ్వానించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సందిగ్ధం ఏర్ప‌డ‌గా.. తాజాగా హైకోర్టు ఆదేశాలు, వ్యాఖ్య‌ల‌తో ఈ ప్ర‌క్రియ జోరందుకోనుంది.

Tags:    

Similar News