జీఎస్టీ 2.0 : ఏపీలో ఆ సెక్టార్ లో యమ జోరు
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుని వచ్చిన రెండవ తరం జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఏపీ మీద బాగానే ఉంది అని తెలుస్తోంది.;
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుని వచ్చిన రెండవ తరం జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఏపీ మీద బాగానే ఉంది అని తెలుస్తోంది. కొన్ని వస్తువుల విషయంలో వస్తు సేవల పన్ను తగ్గింపు అన్నది చాలా కీలకంగానే మారింది అని అంటున్నారు. దాంతో జీఎస్టీ ఉత్సవాలను ఆయా సెక్టార్లలో జోరుగా చేసుకుంటున్నారు. మా మంచి జోరు కనిపిస్తోంది అని కూడా అంటున్నారు.
దసరా సెంటిమెంట్ కి తోడు :
సాధారణంగా దసరా పండుగ వస్తే కనుక అందరి వాహనాలను కొనుక్కుంటారు. కొత్త వాహనాలు తీసుకోవడం ఒక సెంటిమెంట్. అమ్మ వారు శక్తికి స్వరూపం కాబట్టి ఆ విధంగా నూతన వాహనాలను కొనుగోలు చేసి తమ జీవితాల్లో వేగం పెరగాలని ఆశిస్తారు. ఈసారి దసరా కంటే ముందే వాహనాల కొనుగోలు జోరు పెరిగింది. దానికి కారణం జీఎస్టీ 2.0 అని చెబుతున్నారు. ధరలు వివిధ వాహనాల మీద ఒక్కసారిగా తగ్గడంతో జనాలు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు.
అమ్మకాలకు కొత్త స్పీడ్ :
జీస్టీ కొత్త విధానంతో రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చింది. భారీగా ఉండే పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు. జీఎస్టీ 2.0 అమలు అయిన మొదటి రోజు అయిన సోమవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని తెలుస్తోంది. వీటిలో మోటార్ సైకిళ్లు 2,352 ఉంటే కార్లు అలాగే క్యాబ్‌లు 241గా ఉన్నాయి. ట్రాక్టర్లు 60 ఉంటే ఆటోలు 227గా ఉన్నాయి. గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయి
రోజుకు నాలుగు వేలుగా :
ఇదే జోరు కొనసాగితే రానున్న కొద్ది రోజులలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఎంతో ఆనందంగా ఉంది. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయం మీద మాట్లాడుతూ జీఎస్టీ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ లో బాగా వేగం పెరుగుతుందని అన్నారు. త్వరలోనే వాహనాల కొనుగోళ్ళలో ఏపీ మరింత ముందుకు సాగుతుందని మంత్రి మండిపల్లి ధీమాగా చెబుతున్నారు.
దసరా వేరే లెవెల్ :
ఈసారి దసరా వేరే లెవెల్ అని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే విజయదశమి రోజు వాహనాలు కొనే వారు మరింత అధికం అవుతారు అని అంటున్నారు. దాంతో ఇప్పటి నుంచే దానికి తగిన ఏర్పాట్లతో వాహనాల షో రూంలు సిద్ధం అవుతున్నాయి. జీఎస్టీ 2.0 ప్రభావం ఏపీలో ఈ సెక్టార్ మీద గణనీయంగా ఉందని నెంబర్ చెబుతోంది. మరి ఇతర రంగాల సంగతి ఏమిటి అనేది తొందరలో తెలుస్తుంది.