క్యాన్సర్ పసిగట్టే పరికరం - పేద రోగులకు కూటమి వరం

ఏపీలో పేదలు మధ్యతరగతి వర్గాల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-14 03:48 GMT

ఏపీలో పేదలు మధ్యతరగతి వర్గాల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతూ నానా అవస్థలకు గురి అవుతున్న వారి కోసం అత్యాధునిక పెట్ స్కాన్ ని సిద్ధం చేసింది. గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్ ని అందుబాటులో ఉంచారు. అమెరికా నుంచి తెప్పించిన పెట్ స్కాన్ వ్యయం అక్షరాలా 18 కోట్ల రూపాయలు. శరీరంలో ఏ మూలన ఉన్నా కూడా క్యాన్సర్ గుట్టును పసిగట్టే ఈ పెట్ స్కాన్ ని ప్రభుత్వాసుపత్రులలో ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

కార్పొరేట్ సదుపాయం :

ఏపీలో పెట్ స్కాన్ అన్నది ఉంది కేవలం కార్పోరేట్ ఆసుపత్రులలో మాత్రమే. ఆ విధంగా ఈ అత్యాధునిక పెట్ స్కాన్ సదుపాయం ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది ప్రైవేట్‌ కార్పొరేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల లో ఉన్న ఈ సౌకర్యాన్ని పేదలకు అందించాలన్న ఆలోచనను కూటమి ప్రభుత్వం చేసింది. అందుకే గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో దానిని ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల పేద, మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందుకునేందుకు వీలు అవుతుంది.

కీలక మైలురాయి :

నిజానికి ఏపీలో క్యాన్సర్ వైద్యంలో ఇదొక మైలురాయి కాబోతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ కార్పొరేట్‌ అసుపత్రులలో పెట్ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకునే వారి నుంచి సగటున 20 వేల రూపాయల వరకూ నగదుని తీసుకుంటున్నారు.అదే గుంటూరు జీజీహెచ్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న‌ నాట్కో క్యాన్స‌ర్‌ కేంద్రంలో పెట్ స్కాన్ పరీక్షలు చేయించుకున్న వారి నుంచి ఎటువంటి ఫీజు తీసుకోరు. పూర్తి ఉచితంగా ఇవన్నీ లభిస్తాయి. ఇక గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఇప్పటికే 41 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లెవల్-1 స్థాయిలో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు ఇప్పటికే లినాక్, హెచ్ఎఆర్ బ్రాకీ థెరపీ, సి.టి స్టిమ్యులేట‌ర్ వంటి అత్యాధునిక సర్జికల్ ప‌రిక‌రాల్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ క్రమంలోనే యూఎస్ఏ నుంచి పెట్ స్కాన్ ను తెప్పించింది. లేటెస్ట్ గా ట్రయల్ రన్ విధానంలో దీని పనితీరును నిశితంగా వైద్య బృందాలు పరిశీలించాయి. ఈ పెట్ స్కాన్ ద్వారా ఇప్పటి వరకూ యాభై మంది రోగులను పరీక్షించారు

క్యాన్సర్ కణం ఎక్కడ ఉన్నా :

శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడున్నా క‌చ్చితంగా గుర్తించేందుకు ఈ పెట్‌ స్కాన్ ఉపయోగపడుతుంది. దీని సాయంతో క్యాన్సర్ ఏ దశలో ఉంది ఎక్కడెక్కడికి విస్తరించిందనేది స్పష్టం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. సీటీ స్కాన్ లో ఎముకలు, ఎంఆర్ఐలో కణజాలం కనిపిస్తాయి. పెట్‌ స్కాన్ లో క్యాన్సర్ కణితిని కచ్చితంగా నిర్ధారించి చుట్టుపక్కల అవయవాలన్నీ ప్రభావితం కాకుండా అందులో ఏ ప్రాంతానికి ఎంత రేడియేషన్ ఇవ్వాలో కూడా కచ్చితత్వంతో కూడిన వైద్యాన్ని వైద్యులు నిర్ణయిస్తారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో :

క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని నాట్కో ట్ర‌స్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 15 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని నాలుగున్నరేళ్ల‌ కిందట ఇక్కడ నిర్మించారు ఈ కేంద్రంలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్, మెడికల్, న్యూక్లియర్, ప్రివెంటివ్ అంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

Tags:    

Similar News