పెట్టుబడులపైనే వేట.. ఈ ఏడాదే కీలకం.. !
వాస్తవానికి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా.. రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.;
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పెట్టుబడుల సాకారానికి ఈ ఏడాది అత్యంత కీలకంగా మారింది. గత ఏడాది సాధించిన ఎంవోయూలను సాకారం చేసుకునేందుకు వచ్చే 12 మాసాలు కూడా సర్కారుకు అ త్యంత ముఖ్యంగా మారనున్నాయి. ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు జరపాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ క్రమలోనే గత ఏడాది 23 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు.
వీటిలో కాగ్నిజెంట్, టాటా ఆధ్వర్యంలోని టీసీఎస్ మాత్రమే తమ కార్యాలయాలను విశాఖలో ప్రారంభిం చాయి. ఇంకా రావాల్సిన సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిని ఈ ఏడాది సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ప్రభుత్వానికి కీలకంగా మారింది. మరోవైపు పర్యటక రంగంలోనూ పెట్టుబడులను సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వాస్తవానికి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా.. రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక, మరోవైపు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల సంఖ్య.. ఈ ఏడాది 20 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే లెక్కలు తేల్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న వారికి అవకాశం కల్పించాలి. కొత్తగా ఏర్పడే నిరుద్యోగాన్ని తగ్గించాలి.
ఇదేసమయంలో సర్కారుకు ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల రాకపై ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలోనూ ఈ ఏడాది 30 శాతం వరకు ఉద్యోగులు రిటైర్మెంట్ కల్పిస్తారు. 62 ఏళ్లు నిండిన వారు.. ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా దేవదాయ, హోం, రెవెన్యూ శాఖల్లో ఈ లోటు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగాలు, పెట్టుబడులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టనుందని అంటున్నారు.