ఏపీ అంటే ...అప్పుల మంత్రి....అప్పుల వారం

రాజ్యాలు అవే ఉన్నాయి. రాజులు మాత్రమే మారారు. పాలనలో ఎవరి అజెండా వారిదే. కానీ ఖజానా మాత్రం అదే.;

Update: 2025-08-02 16:30 GMT

రాజ్యాలు అవే ఉన్నాయి. రాజులు మాత్రమే మారారు. పాలనలో ఎవరి అజెండా వారిదే. కానీ ఖజానా మాత్రం అదే. చేతిలో డబ్బు లేనపుడు ఏమి చేస్తారు అంటే అప్పులే అన్నది జనాంతికమైన మాట. ప్రభుత్వాలు అయినా అదే చేయాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఏపీలో రాజకీయంగా పోటా పోటీగా ఉంది. రెట్టింపు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి కష్టాలు కూటమికి ఉన్నాయని అంటున్నారు.

అప్పుల మంత్రి ఢిల్లీలో :

ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. అవును వైసీపీ అయిదేళ్ళలో ఆర్ధిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఉండేవారు. ఆయన ఏపీలో అయితే కనిపించేవారు కాదు ఎపుడూ ఢిల్లీలోనే అని నాడు విపక్షాలు ఎకసెక్కమాడేవి. పైగా ఆయనకు ముద్దుగా అప్పుల మంత్రి అని పేరు కూడా పెట్టారు. ఆర్ధికంగా ఏమీ లేకపోతే అప్పులే కదా. అందుకే ఆయన కేంద్ర పెద్దలతో అప్పులో కోసం తిప్పలు పడుతూ ఢిల్లీలోనే ఎపుడూ కనిపించేవారు అని అంటుండేవారు.

కట్ చేస్తే సేమ్ సీన్ :

అవును సీన్ అదే. కానీ వ్యక్తులు ప్రభుత్వాలు మారాయి అని అంటున్నారు. ఏపీలో కూటమి పాలనలో పెద్ద ఎత్తున అప్పులు గత పదిహేను నెలలలోనే పేరుకుపోయాయని వామపక్షాల నుంచి అంతా అంటున్న మాట. లక్షా ఎనభై వేల కోట్ల అప్పులు ఈ మధ్యలో చేశారు అని చెబుతున్నారు. ఇన్నేసి వేల కోట్ల అప్పులు చేయడం వల్ల ఏపీ మరో శ్రీలంక అవదా అని వైసీపీ ఎటూ ఎద్దేవా చేస్తోంది. అది వేరే విషయం. కానీ ఇపుడు వైసీపీ కూటమిని పొలిటికల్ గా ర్యాంగింగ్ చేస్తోంది. తమకు అప్పులు అని తెగ టీజ్ చేశారు కదా మీరు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తోంది.

అప్పుల వారం వచ్చేస్తోంది :

ఇది వైసీపీ టీడీపీ కూటమి మీద చేస్తున్న ఘాటు విమర్శ. ప్రతీ మంగళవారం అప్పుల వారంగా వైసీపీ పేర్కొంటోంది. ఆ రోజున రిజర్వ్ బ్యాంక్ వద్ద బాండ్లను వేలం వేయడం అప్పులు తెచ్చుకోవడం కూటమి ప్రభుత్వం నిర్వాకంగా మారింది అని దెప్పిపొడుస్తోంది. ఈ నెల 5వ తేదీన మంగళవారం మరో అయిదు వేల కోట్ల రూపాయల అప్పులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని కూడా విమర్శిస్తోంది. కేవలం 13 నెలలలోనే ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని దుయ్యబెడుతోంది. వివిధ రాష్ట్రాల సెక్యూరిటీ స్టాక్స్ విక్రయానికి ఆర్బీఐ వేసిన నోటిఫికేషన్ ని ట్వీట్ చేస్తూ వైసీపీ ఈ విధంగా పేర్కొంది. అందులో ఏపీ నుంచి అయిదు వేల కోట్లుగా ఉంది.

ప్రణాళికేతర వ్యయానికేనా :

అప్పులు తేవడం ఎవరు చేసినా తప్పు కాదు అప్పుతోనే అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ప్రణాళికా వ్యయానికి ఖర్చు చేస్తే ఫలితం ఉంటుంది. ఉత్పాక రంగాలకు అనుత్పాదక రంగాలకు అని ఉంటాయి. అంటే ప్రొడక్షన్ మీద అప్పు పెడితే అది రికవరీ అవుతుంది. కానీ పధకాలు పప్పు బెల్లాల పందేరం కోసం అప్పులు తెస్తే మాత్రం అవి ఏపీకి గుదిబండలు అవుతాయి. వైసీపీ చేసిన అప్పులు అలాంటివే. 2.75 లక్షల కోట్లు అలాగే అయిదేళ్ళలో అనుత్పాదకంగా పోయాయి. ఇపుడు రెట్టింపు సంక్షేమం పేరుతో కూటమి కూడా అప్ప్పు తెచ్చే కధ నడిపిస్తోంది. ఈ విషయంలో పాలసీలు మార్చుకోకపోతే ఏకంగా ఏపీ అంటేనే అప్పుల రాష్ట్రం అన్న పేరు బయటవారు పెట్టే ప్రమాదం పొంచి ఉంది.

Tags:    

Similar News