నచ్చినట్లు మాట్లాడితే కూటమిలో తిప్పలే.. మంత్రి నారాయణ స్వీయ అనుభవం
ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధినేతల మధ్య చక్కటి సమన్వయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూటమిలో సఖ్యతపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.;
ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధినేతల మధ్య చక్కటి సమన్వయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూటమిలో సఖ్యతపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కొందరు నేతలు గొప్పలకు పోయి కూటమిపైన, ప్రభుత్వ పనితీరుపైన చేస్తున్న విమర్శలు చిచ్చు పెట్టేందుకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా వెల్లడించడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల పార్టీ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడిన మంత్రి నారాయణ.. నెల్లూరుకు చెందిన కొందరు నేతలు చేసిన ప్రకటనలతో తాను మిత్రపక్షానికి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు వివరణ ఇచ్చుకోవాల్సివచ్చిందని వాపోయారని అంటున్నారు.
కూటమి మరో 15 కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆరు నూరైనా నూరు ఆరైనా పవన్ తో కలిసి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయి నేతలు మాత్రం కూటమిలో కుంపట్లు రాజేసేలా ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత 16 నెలలుగా కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు తలెత్తినా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సమన్వయం ఉండటంతో అవేవీ బయటకు రాలేదు. అయితే ఇటీవల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుండటంతో ఒక పార్టీ తప్పులను మరో పార్టీ ఎత్తిచూపుతోందని అంటున్నారు. దీనికి మున్సిపల్ మంత్రి నారాయణ వ్యాఖ్యలే నిదర్శనమని ఉదహరిస్తున్నారు.
తాజాగా నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడిన మంత్రి నారాయణ.. చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ దుమారంలో విలువైన మాటలు తెరమరుగయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరుకు చెందిన ఓ నేత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విమర్శలు చేయడాన్ని మంత్రి నారాయణ తప్పుబట్టారని అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న మనమే అలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్లవా? అంటూ మంత్రి నారాయణ సదరు నాయకుడిని ప్రశ్నించినట్లు సమాచారం.
రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలతో తాను సివిల్ సప్ల్సై మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి వివరణ ఇచ్చుకోవాల్సివచ్చిందని మంత్రి నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ విషయమై తనను ప్రశ్నించారని నారాయణ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో మిత్రపక్షాలే విమర్శలు చేయడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి, అంతకన్నా చిన్న స్థాయిలో పనిచేస్తున్న నేతలు సైతం మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం సూచిస్తోంది.
ఇప్పటికే కూటమిలో చిచ్చు రేపేలా విపక్షం వైసీపీ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోందని చెబుతున్న కూటమి నేతలు.. మూడు పార్టీల్లో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటాన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న నేతలు సైతం బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాలను పట్టించుకోకుండా వదిలేస్తే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.