వైసీపీకి ట‌చ్‌లో కొంత మంది ఎమ్మెల్యేలు.. నిజ‌మేనా.. ?

Update: 2026-05-08 12:30 GMT

ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొంత మంది వైసీపీకి టచ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసిపి నాయకులు సైతం అవును... కొందరు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇది వాస్తవమేనా.. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది.. అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎవరూ ఊహించరు. కానీ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని వైసిపి నాయకులు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

కానీ ఎవరూ ఈ విషయంలో బయటపడటం లేదు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా వైసిపి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలోనే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని చెబుతుండడం ఆసక్తిగా మారింది. అయితే, ఇప్పటికిప్పుడు దీనివల్ల ఇటు కూటమికి వచ్చిన నష్టం కానీ అటు వైసిపికి వచ్చిన లాభంగానీ ఏమీ కనిపించడం లేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఇది ఒక రకంగా ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న పరోక్ష వ్యతిరేక ప్రచారంగా కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. పాలనకు కూడా వ్యతిరేకంగా ఉన్నారని.. చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని పలుచన చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అటు సీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు అసంతృప్తితోనే ఉన్నారు. ఈ విషయంపై పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చర్చ కూడా నడుస్తోంది. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. బిజెపిలో ఆదినారాయణ రెడ్డి నుంచి జనసేనలో లోకం మాధవి వరకు కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు.

ఇక, టిడిపిలో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. అయితే, ఎప్పటికప్పుడు ఆయా పార్టీలు నేతలతో మాట్లాడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకునే దిశగా ప‌ని చేస్తున్నారు. కలివిడిగా ముందుకు సాగాలని చెబుతున్నారు. దీంతో తరచుగా వస్తున్న విభేదాలు ఒకింత స‌మ‌స్య‌గా మారే పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ సమయంలోనే వైసీపీ ఇలాంటి నేతలను తమ వైపు ఉన్నారని చెప్పుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇది నిజం కాదని, కొంతమందిలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని అయినంత మాత్రాన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇక జనసేనలోనూ ఈ తరహా చర్చ నడుస్తున్నప్పటికీ ఎవరు పార్టీ వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. బిజెపిలో ఈ విషయంపై నాయకులు మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి వంటి సీనియర్ నాయకుడి వ్యవహారంలో ఎవరు మాట్లాడటం లేదు.

ఇక, ఉత్తరాంధ్రలో విష్ణుకుమార్ రాజు కూడా తీవ్ర అసంతృప్తి తో ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఆయన పార్టీని వదిలి వెళ్లే టైపు నాయకుడు కాకపోవడం విశేషం. మొత్తంగా చూస్తే వైసిపి చేస్తున్న  ఎమ్మెల్యేల ప్రచారం కేవలం రాజకీయం కోసమేనని స్పష్టమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  

Tags:    

Similar News