బాబూ లోకేష్ ఇద్దరూ లేకుండానే !
ఏపీలో కూటమి ప్రభుత్వం సారధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల విదేశీ పర్యటనకు ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నారు.;
ఏపీలో కూటమి ప్రభుత్వం సారధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల విదేశీ పర్యటనకు ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నారు. నవంబర్ లో విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుని అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాంతో ప్రపంచంలోని నలుమూలలూ చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. లోకేష్ మాటలో చెప్పాలంటే ఆకలితో ఏపీ ఉంది, పెట్టుబడుల వేట సాగిస్తోంది.
లోకేష్ అక్కడ :
ఈ క్రమంలో నారా లోకేష్ ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన వారం రోజుల పాటు సాగనుంది. తిరిగి లోకేష్ ఈ నెల 25 నాటికి కానీ ఏపీకి చేరుకోరని అధికార వర్గాలు తెలిపాయి. ఇక లోకేష్ సిడ్నీలో రోడ్ షోలో పాల్గొన్నారు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏపీ మీద పూర్తి ఆశావహ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. లోకేష్ ఆస్ట్రేలియాలో మరిన్ని సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బాబు సైతం :
ఇక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనను చేపట్టారు. ఈసారి ఆయన దుబాయ్, అబుదాబీ, యూఏఈలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఆయన ఈ ప్రాంతాలలో పారిశ్రామికవేత్తలను కలసి ఏపీకి పెట్టుబడులు పెట్టడం గురించి సోదహరణంగా వివరిస్తారని అంటున్నారు. అంతే కాకుండా ఏపీ ఏ విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది అన్నది తెలియచేస్తారు. ఏపీలో ఉన్న అవకాశాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇండస్త్రీస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ వంటివి కూడా ఆయన తెలియచేస్తారని అంటున్నారు.
ఈ రంగాలే టార్గెట్ :
ఏపీలో కీలకమైన నిర్మాణ రంగం అలాగే రియల్ ఎస్టేత్ రంగం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ ఫీల్డ్ ఇలా ఈ రంగాలను ఎంచుకుని వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను బాబు ఏపీకి ఆహ్వానించనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా దిగ్గజ సంస్థలతో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశం అవుతారని అంటున్నారు. రానున్న రోజులలో ఈ రంగాలలో విశేషంగా పెట్టుబడులు తీసుకుని వస్తే ఏపీ ప్రగతి గతి మారుతుందని బాబు ఆశిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి పర్యటన కీలకంగా మారింది. సీఎం వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఈ విదేశీ పర్యటనకు వెళ్తోంది.
స్టీరింగ్ అక్కడ నుంచే :
ఏపీ సీఎం గా చంద్రబాబు మూడు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన రాష్ట్రంలో ఉండరు. అదే విధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఏపీలో ఉండరు. మరి పాలన ఎలా అంటే సీఎం ఎక్కడ నుంచి అయినా పాలిస్తారు. టెక్నాలజీ మీద పూర్తి పట్టు ఉన్న చంద్రబాబు విదేశాలలో ఉన్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని తీసుకుంటూ అక్కడ నుంచే పాలన కొనసాగిస్తారు అని అంటున్నారు. గతంలో అయితే సీఎంలు విదేశాలకు వెళ్తే ఇతర సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించేవారు. కానీ గడచిన కొన్నేళ్ళలో టెక్నాలజీ వచ్చి అన్ని మార్చేసింది. దాంతో ఎవరు ఎక్కడ ఉన్నా ఎంత దూరం ఉన్నా పాలన సులువుగానే సాగిపోతోంది. సో బాబు కానీ లోకేష్ కానీ దేశంలో లేకపోయినా స్టీరింగ్ మాత్రం బాబు వద్దనే ఉంటుంది అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.