ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం.. నూజివీడు.. ఇంకెన్ని?
అవును.. కొత్త జిల్లాల ఏర్పాటులో చోటు చేసుకున్న తప్పుల్ని సరి చేసేందుకు కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది.;
అవును.. కొత్త జిల్లాల ఏర్పాటులో చోటు చేసుకున్న తప్పుల్ని సరి చేసేందుకు కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది. పాలనా పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు సరి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా తొలి దశలో గన్నవరం.. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లా పరిదిలోకి తీసుకొచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అంశాలపై తుది నిర్ణయాన్ని ఈ నెల పదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం.. నూజివీడు మాత్రమే కాదు.. క్రిష్ణా జిల్లాలో కైకలూరును అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపే ప్రతిపాదన కూడా ఉంది. ఇదే కాదు.. మార్కాపురం.. మదనపల్లె కేంద్రంగా రెండు కొత్త జిల్లాలతో పాటు పీలేరు.. అద్దంకి.. గిద్దలూరు.. మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న అంశంపైనా కసరత్తు చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల సమయంలో సరైన కసరత్తు లేకుండా.. హడావుడిగా కొత్త జిల్లాల నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాలనా పరమైన కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ లో ఉండేలా మార్పులు చేయాలని కూటమి సర్కారు భావిస్తోంది. ఇలా చేస్తే.. పాలనా పరమైన సమస్యలు పరిష్కారమవుతాయి.
ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ లో ఉండాలన్నఆలోచన బాగానే ఉన్నా.. వాస్తవంగా అదంత సులువైన పని కాదు. అందుకే రాష్ట్రమొత్తంగా మార్పులు చేయకుండా కొన్ని చోట్ల మార్పులు చేపట్టి.. దశల వారీగా మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేయనున్నారు. దీనికి సంబంధించిన అంశాల్ని ఈ నెల పదిన జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయాన్ని తీసుకునే వీలుందని చెప్పక తప్పదు. గతంలో మాదిరి కాకుండా ఈసారి పాలనా సౌలభ్యం.. ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ.. శాస్త్రీయంగా రెవెన్యూ డివిజన్ల విభజన చేపట్టాలని కూటమి సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో కొన్ని నియోజకవర్గాల్ని ఈ తరహాలో ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు.