పవన్ తోసహా జనసేన మంత్రుల డుమ్మా! స్థానిక ఎన్నికల వేళ ఒత్తిడి పెంచే వ్యూహమా?

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ సమావేశం శనివారం అత్యవసరంగా భేటీ అయింది.

Update: 2026-10-10 16:40 GMT

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ సమావేశం శనివారం అత్యవసరంగా భేటీ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు జనసేన పార్టీకి చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ గైర్హాజరు అయ్యారు. ఒకేసారి మిత్రపక్షానికి చెందిన ముగ్గురు మంత్రులు హాజరుకాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత 28 నెలల్లో ఎప్పుడూ ఇలా జనసేన నేతలు మూకుమ్మడిగా డుమ్మాకొట్టిన సందర్భం లేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో జనసేన మంత్రులు కేబినెట్ భేటీకి హాజరుకాకపోవడంపై అనేక ఊహగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

పవన్ క్లారిటీ

ఇక జనసేన మంత్రులు గైర్హాజరు కావడం, దీనిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి స్పందించింది. కేబినెట్ సమావేశానికి పవన్ ఎందుకు హాజరు కాలేకపోయారో వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శనివారం మహాలయ అమావాస్య ఉండటంతో పితృదేవతలకు తర్పణాలు సమర్పించేందుకు పవన్ పూజలు చేస్తున్నారని, ఆ కారణంగానే డిప్యూటీ సీఎం కేబినెట్ భేటీకి హాజరుకాలేదని వివరించింది. అయితే ఇందులో మిగిలిన ఇద్దరు మంత్రుల గైర్హాజరుకు కారణాలు తెలియజేయకపోవడంతో నెటిజన్ల మధ్య ఎడతెగని చర్చ జరిగింది. దీంతో జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఎక్కడున్నారనే చర్చ ఎక్కువగా జరిగింది.

విదేశాలకు దుర్గేశ్

అధికారిక కార్యక్రమాలపై పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ విదేశీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ కారణంతోనే ఆయన కేబినెట్ సమావేశానికి రాలేకపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత పనుల కారణంగా అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి జనసేన మంత్రులు ముగ్గురు ఒకేసారి గైర్హాజరు కావడంపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి ఆ పార్టీ ఆఘమేఘాలపై స్పందించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న ఈ సమయంలో ప్రతి సంఘటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా కూటమి నుంచి జన సేనను వేరు చేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి రాజకీయాలపై అనుమానాలు రేకెత్తించే ప్రతి ఘటనను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే పవన్ సహా జనసేన మంత్రులు గైర్హాజరు కావడంపై అనేక అనుమానాలను ప్రచారంలోకి తీసుకువచ్చారని అంటున్నారు. అదే సమయంలో కీలక ఎన్నికల ముందు ఇలాంటి ప్రచారం జరగడం భావ్యం కాదనే ఆలోచనతో జనసేన కూడా వేగంగా స్పందించి వివరణ ఇచ్చిందని చెబుతున్నారు.

Tags:    

Similar News