ఏపీ బడ్జెట్ భారీ మార్క్ ని దాటుతుందా ?

ఏపీ బడ్జెట్ కి రంగం సిద్ధం అయింది. బడ్జెట్ సమావేశాలు ఏపీలో ఫిబ్రవరి నెలలో మొదలు కానున్నాయి.;

Update: 2026-01-29 00:30 GMT

ఏపీ బడ్జెట్ కి రంగం సిద్ధం అయింది. బడ్జెట్ సమావేశాలు ఏపీలో ఫిబ్రవరి నెలలో మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఇక 14న ఏపీ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ని సభలో ప్రవేశపెడతారు.

గతసారి బడ్జెట్ లో :

ఇదిలా ఉంటే 2024 జూన్ 12న ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. గతసారి ఏకంగా మూడు లక్షల 22 వేల కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లకు పైగా మార్క్ ని ఆ ఏడాది తాకింది. దానికి కారణం ఏపీ ఆదాయం పెరుగుతోందని వివిధ రంగాల నుంచి రావాల్సిన ఆదాయం వస్తుందని అంచనాలతో ఆ బడ్జెట్ ని రూపకల్పన చేశారు. ఇక ఈసారి బడ్జెట్ చూస్తే దానిని మించి ఉండొచ్చు అని అంటున్నారు.

అభివృద్ధికి సూచికగా :

ఈసారి బడ్జెట్ అభివృద్ధికి సూచికగా ఉండొచ్చు అని అంటున్నారు. ఈసారి బడ్జెట్ ఏకంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల పై దాటి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో గత ఏడాది కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అంతే కాదు అభివృద్ధికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి మరీ అమలులోకి పెడుతున్నారు. దాంతో బడ్జెట్ సైజు కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. అలాగే అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఈసారి బడ్జెట్ కూర్పు ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే చూస్తే కనుక అమరావతికి భారీ వాటా ఉండొచ్చు అన్నది కూడా ఉంది. అలాగే పోలవరం కోసం కూడా కేటాయింపులు ఉండొచ్చు అని అంటున్నారు. ఏపీలో సాగునీటి పారుదల రంగానికి సైతం బడ్జెట్ లో అగ్ర తాంబూలం ఉండొచ్చు అని చెబుతున్నారు. అలాగే సంక్షేమం అభివృద్ధి రెండింటికీ సమంగా ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు.

వ్యవసాయ బడ్జెట్ లో :

ఇక గత ఏడాది అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్ చూస్తే 48 వేల కోట్లతో ప్రవేశపెట్టారు. ఈసారి దానికి మించి ఉండొచ్చు అన్నది కూడా చెబుతున్నారు. కనీసంగా అరవై వేల కోట్ల దాకా ఈసారి వ్యవసాయ బడ్జెట్ ని రూపకల్పన చేస్తున్నారు అని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీ బడ్జెట్ ఈసారి ఆసక్తిని రేపుతోంది. గతానికి కంటే అధిక మొత్తాలే వివిధ రంగాలకు కేటాయింపులు చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News