బీజేపీలో సడన్ ఛేంజ్..!! ఒక్కసారిగా ఈ మార్పు ఏంటో?
ఈ పరిస్థితుల్లో బీజేపీ భాగస్వామ్యానికి తగిన గుర్తింపు రావడం లేదని ఆ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర నాయకత్వంలో కూడా కదలిక వచ్చిందని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వంలో భాగమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో అంటీముట్టనట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోందని అభిప్రాయం నెలకొంది. గత రెండేళ్లుగా రాష్ట్ర బీజేపీ నేతల వైఖరిని చూస్తే ఇదే విషయం తెలుస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానమైన ప్రాజెక్టులు, కూటమి నేతలపై వచ్చే విమర్శలపై బీజేపీ నేతలు పట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్ల రాష్ట్రంలో కూటమి అనగానే టీడీపీ, జనసేన పార్టీలే గుర్తుకు వచ్చేలా పరిస్థితి తయారైంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చుట్టూ రాజకీయం కేంద్రీకృతమవుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ భాగస్వామ్యానికి తగిన గుర్తింపు రావడం లేదని ఆ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర నాయకత్వంలో కూడా కదలిక వచ్చిందని అంటున్నారు.
ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు భవిష్యత్తులో కూడా మరో 15 ఏళ్లు కలిసి పనిచేస్తామని చెబుతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కలిసిమెలిసి ఉండాలని నేతలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా సౌండ్ వినిపించడం లేదనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే సమయంలో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని భాగస్వామ్యం చేస్తున్నారు. అయితే ఆయా పథకాలు, పనులను ఓన్ చేసుకోవడంలో బీజేపీ వెనకబడిందనే అభిప్రాయమే ఎక్కువ నెలకొంది.
కూటమిలో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ యాక్టివ్ గా పనిచేస్తూ ప్రతి పథకం, ప్రాజెక్టుపై తరచూ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తున్నారని అంటున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో మాట్లాడటం లేదని, దీంతో కూటమిలో బీజేపీ పాత్ర నామమాత్రంగా ఉందనేలా పార్టీ నేతలే అవకాశం ఇస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ప్రస్తుతం అనూహ్య మార్పు మొదలైందని అంటున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలో.. క్షేత్రస్థాయి కార్యకర్తల అంతర్గత సమాచారమో కానీ బీజేపీ రాష్ట్ర పెద్దలు ప్రభుత్వ వ్యవహారాలను సొంతం చేసుకునేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
దీనికి తాజా ఉదాహరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పోలవరం ప్రాజెక్టు సందర్శనే అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో పోలవరం పనులు పరిగెట్టిస్తున్నారు. 2014-19 మధ్య 72 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత ఐదేళ్లు ముందుకు కదల్లేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును 89 శాతం పూర్తిచేసినట్లు సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే మార్చినాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేసేలా పనులు పూర్తి చేస్తామని కూడా వెల్లడించారు. దీంతో బీజేపీ నాయకత్వం కూడా మేల్కొందని అంటున్నారు.
కేంద్ర నిధులతో నిర్మిస్తున్న పోలవరం క్రెడిట్ మొత్తం టీడీపీ వేసుకుంటోందని గ్రహించిన బీజేపీ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉందనే కోణంలో ప్రచారం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ను పంపిందని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొనాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో మిగిలిన రెండు పార్టీలకు సమానంగా బీజేపీకి క్రెడిట్ దక్కేలా మునుముందు నడుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి స్పష్టమైన సూచనలు వచ్చాయని చెబుతున్నారు.