ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఐసీసీ పెద్ద ప్లానింగే
ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పూనకాలే. మైదానంలో ఆటగాళ్లు చెమటలు చిందిస్తే.. టీవీల ముందు జనాలు బీపీ టాబ్లెట్లు మింగుతుంటారు
ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పూనకాలే. మైదానంలో ఆటగాళ్లు చెమటలు చిందిస్తే.. టీవీల ముందు జనాలు బీపీ టాబ్లెట్లు మింగుతుంటారు. అయితే ఈ భావోద్వేగాలను, దేశభక్తిని చాలా సున్నితంగా, అంతకంటే చాలా 'ఆర్థికంగా' వాడుకోవడంలో ఐసీసీని మించిన వారు లేరు. "భక్తులారా.. మీ భక్తి మాకు కలెక్షన్ల ముక్తి" అన్న చందంగా రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ఒక రేంజ్ లో స్కెచ్ వేసింది. అదేంటంటే... ఒకే టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఏకంగా మూడుసార్లు తలపడేలా ఫార్మాట్‌ను డిజైన్ చేయడం.. అవును మీరు విన్నది నిజమే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్‌లు.. ఇలాంటి అద్భుతమైన "బిజినెస్ ఐడియా" ఐసీసీ మేధావులకే సాధ్యం. మరి ఆ మూడు మ్యాచ్‌ల వెనుక ఉన్న మాయాజాలం ఏంటో ఒకసారి చూద్దాం.
ఆ త్రీ-స్టెప్ ప్లాన్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్?
ఐసీసీ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఈసారి 14 జట్లు టోర్నీలోకి వస్తాయి. కానీ పాపం ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన మూడు చిన్న జట్లను "నువ్వు ముందు ఇక్కడ కొట్టుకుని చావు" అంటూ ఒక ప్రత్యేక క్వాలిఫయింగ్ సిరీస్ ఆడించి అందులోంచి ఒక్కరినే మెయిన్ టోర్నీకి రానిస్తారు. చిన్న జట్ల ఎదుగుదల కంటే మా గల్లా పెట్టె నిండడమే ముఖ్యం కదా మరి..
ఇక అసలు కథ ఇక్కడి నుండి మొదలవుతుంది..
మొదటి విడత పూనకంలా గ్రూప్ స్టేజ్ లో మిగిలిన 12 జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఇక ఐసీసీకి ఒక సెంటిమెంట్ ఉంది. భూమి బద్దలైనా, ఆకాశం విరిగిపడినా భారత్, పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో పడేస్తారు. ఎందుకంటే గ్రూప్ స్టేజ్‌లోనే బోణీ కొట్టాలి కదా.. అలా మనకు మొదటి భారత్-పాక్ మ్యాచ్ గ్యారెంటీగా లభిస్తుంది.
రెండో విడత వినోదం సూపర్-7 రౌండ్
గ్రూప్ స్టేజ్ అయిపోయాక జట్లను ఇంటికి పంపించేస్తే ఐసీసీకి ఏం లాభం? అందుకే ఈసారి కొత్తగా 'సూపర్-7' అనే రౌండ్ కనిపెట్టారు. గ్రూప్ లో టాప్ లో ఉన్న 7 జట్లు ఇక్కడ చేరతాయి. ఇక్కడ ప్రతి జట్టు మిగతా ఆరు జట్లతో తలపడాలి. అంటే భారత్, పాక్ రెండు జట్లు సూపర్-7కి వస్తే.. కచ్చితంగా వచ్చేలానే గ్రూపులు పెడతారనుకోండి అక్కడ రెండోసారి తలపడతాయి. యాడ్స్ రేట్లు డబుల్, మన బీపీలు ట్రిపుల్..
సూపర్-7 ముగిశాక టాప్-4 జట్లు సెమీస్‌కి వెళ్తాయి. పాయింట్ల లెక్కలను బట్టి ఇరు జట్లు సెమీఫైనల్లో తలపడొచ్చు. ఒకవేళ అక్కడ మిస్ అయినా ఇద్దరూ గెలిచి ఫైనల్ కి చేరితే... ఇక అంతే సంగతులు.. ఒకే వరల్డ్ కప్‌లో మూడోసారి ఇండియా-పాక్ మ్యాచ్. ఐసీసీ బ్యాంక్ అకౌంట్లు నిండిపోయి బ్యాంకర్లకే షాక్ తగిలే రేంజ్ లో కలెక్షన్లు వస్తాయి.
క్రికెట్ బోర్డుల 'కళ్లల్లో ఆనందం'.. చిన్న జట్ల 'కళ్లల్లో నీళ్లు'
"మాకు క్రికెట్ డెవలప్‌మెంట్ ముఖ్యం కాదు సార్.. డిజిటల్ వ్యూస్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్స్ మాత్రమే ముఖ్యం" అని ఐసీసీ నోరు తెరిచి చెప్పకపోయినా ఈ కొత్త ఫార్మాట్ చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుంది.
ఈ కొత్త ప్లాన్ పై విమర్శకులు పెదవి విరుస్తున్నారు. "ఇది వరల్డ్ కప్ లా లేదు.. భారత్-పాక్ ట్రై సిరీస్ లా ఉంది" అని సెటైర్లు వేస్తున్నారు. చిన్న జట్లకు అవకాశాలు తగ్గించేసి, కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే ఐసీసీ ఇంత పెద్ద డ్రామా ఆడుతోందని విశ్లేషకులు వాపోతున్నారు.
కానీ ఐసీసీ మాత్రం "విమర్శలు మీరు చేసుకోండి.. కలెక్షన్లు మేము లెక్కపెట్టుకుంటాం" అనే ధీమాతో ఉంది. ఏదేమైనా ఒకే వరల్డ్ కప్‌లో మూడు భారత్-పాక్ మ్యాచ్‌లు అంటే బ్రాడ్‌కాస్టర్లకు పండగే ఐసీసీకి కాసుల వర్షమే. అభిమానులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. మరి ఈ సూపర్ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు పండుతుందో చూడాలి.