అతి చేస్తే.. ఇమేజ్ పెరుగుతుందా అంబటి గారూ!
అతి వినయం, అతి ప్రవర్తన ఎప్పటికీ వర్కవుట్ కావు. అది రాజకీయమైనా.. వ్యక్తిగతమైనా.. కూడా ఇబ్బందే.
అతి వినయం, అతి ప్రవర్తన ఎప్పటికీ వర్కవుట్ కావు. అది రాజకీయమైనా.. వ్యక్తిగతమైనా.. కూడా ఇబ్బందే. ఈ విషయాన్ని రాజకీయాల్లో ఉన్నవారు ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. కానీ, ఈ విషయంలో వైసీపీ నాయకు లు కొందరు గుర్తించలేక పోతున్నారు. ఇంకా అతి చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఉన్న పేరు పోవడంతోపాటు ఏవగించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ జాబితాలో తొలి వరుసలో ఉన్నారు... మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు. ఆయన చేస్తున్న అతి ప్రవర్తన కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తోందని.. దీంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని కొందరు నేరుగా చెబుతున్నారు. మరికొందరు పార్టీకి సంకేతాలు ఇస్తున్నారు. అయితే.. పార్టీ ఆయనను చూసీ చూడనట్టు వదిలేస్తోందో.. లేక.. ఏమైనా ఫర్లేదులే అని అనుకుంటోందో తెలియదు కానీ.. అంబటి దూకుడు మాత్రం ఆగడం లేదు.
ఏదైనా అవసరం ఉన్న చోట అతిగా ప్రవర్తిస్తే తప్పులేదు. కానీ, అవసరం లేని చోట కూడా దూకుడుగా వ్యవహరిం చి.. ఏదో హైలెట్ కావడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తే.. అది మొత్తానికే బ్యాడ్ అయిపోతుందన్న విషయాన్ని అంబటి గ్రహించాల్సి ఉంటుంది. తాజాగా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వం ఆయన పార్ధివ దేహానికి గౌరవ వందనం సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు రంగంలోకి దిగి.. గౌరవ వందనం సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
అయితే.. వీరిని అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన అంబటి.. దురుసుగా ప్రవర్తించారు. దీనిపై కిర్లంపూడి పోలీసులు కేసు పెట్టారు. ఈ విషయం పక్కన పెడితే.. అంబటి ఇలాంటి సునిశిత సమయంలో కూడా పోలీసులను నెట్టేయడం.. వారితో వాగ్వాదానికి దిగడంపై కాపు నాయకులు, సంఘాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి సందర్భాల్లోనూ పైచేయి సాధించాలన్న ఉత్సాహం ఎందుకని కొందరు ప్రశ్నించారు. మరికొందరు అంబటికి సంబంధం లేని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మొత్తంగా పరిణామాలు.. అంబటికి ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి మాత్రం రాజకీయంగా ఇబ్బందిగానే మారుతున్నాయని అంటున్నారు. అంతే కాదు.. జగన్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం.. అంబటిని దారిలో పెట్టక పోవడంపై సీనియర్లు కూడా పెదవి విరుస్తున్నారు. ``కొందరు నాయకుల కారణంగా పార్టీ దెబ్బతింటోంది. ఆయన అతి చేస్తున్నారని అందరకీ తెలుసు. కానీ, ఏం చేస్తాం. అధిష్టానమే ఆయనను వదిలేసిందేమో`` అని తూర్పుగోదావరికి చెందిన అదే కాపు సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ్యాఖ్యానించడం అంబటి పరిస్థితిని , ఆయన వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.