అప్పుడు ఆహ్వానం.. ఇప్పుడు తిరస్కారం.. వాంగ్ చుక్ పై కేంద్రం మొండి వైఖరి! నెట్టింట హాట్ డిబేట్
ఈ ఇద్దరు మూడేళ్ల క్రితం భేటీ అయిన ఫొటో ఇప్పుడు నెట్టింట హాట్ డిబేట్ కు తెరలేపింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రముఖ సామాజికవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మధ్య ఉన్న గత అనుబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు మూడేళ్ల క్రితం భేటీ అయిన ఫొటో ఇప్పుడు నెట్టింట హాట్ డిబేట్ కు తెరలేపింది. నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ ఉదంతానికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దాదాపు 19 రోజులుగా కొనసాగుతున్న వాంగ్ చుక్ దీక్షపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం విద్యావ్యవస్థ పటిష్టత కోసం సోనమ్ వాంగ్ చుక్ సలహాలు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు లోపాలు ఎత్తిచూపేసరికి శత్రువుగా మారిందని విద్యావేత్తలు, విద్యార్థులు మండిపడుతున్నారు.
దేశంలో విద్యావ్యవస్థ పటిష్టానికి సామాజిక సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావించింది. 2023లో ఆయనతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా భేటీ అయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అమలు, విద్యావ్యవస్థ పటిష్ఠతపై ఈ ఇద్దరు చర్చించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ నిబద్ధత, మేధస్సును ప్రశంసిస్తూ మంత్రి ప్రధాన్ స్వయంగా ట్వీట్లు చేశారు. అప్పట్లో ప్రభుత్వం వాంగ్‌చుక్ లాంటి మేధావుల సలహాలను స్వీకరించడం ఒక గొప్ప పరిణామంగా ప్రముఖులు వ్యాఖ్యానించారు. అయితే, కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.
ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు విద్యా సంస్కరణల కోసం చర్చించుకున్న వారే ఇప్పుడు పరస్పర విరుద్ధ ధృవాలుగా నిలబడటం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ గత 19 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరంతర ఉపవాసంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దాదాపు 10 కిలోల బరువు తగ్గారని, బాగా నీరసించిపోయారని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం పట్ల దేశవ్యాప్తంగా మేధావి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అప్పట్లో వాంగ్‌చుక్ సూచనలను ఆహ్వానించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆయన డిమాండ్లను కనీసం చర్చకు కూడా తీసుకోకపోవడం గమనార్హం.
మరోవైపు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసన గళాలు ఎక్కువవుతున్నాయి. ఈ దేశానికి వాంగ్ చుక్ వంటి మేథావుల గళం అవసరమని నెటిజన్లు కోరుతున్నారు. కేంద్రం స్పందించకపోయినా ‘జాతి అంతరాత్మను మేల్కొలిపారు’ నిరాహారదీక్ష అవసరం కూడా అదే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లేఖరాశారు. వాంగ్ చుక్ దీక్ష విరమించాలని శశిథరూర్ కోరారు. మరోవైపు వాంగ్ చుక్ అద్భుతమైన వ్యక్తి, అలాంటి మేథావి మరణించకూడదు అంటూ భారతీయ అమెరికన్ నటుడు ఓమి వైద్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2009లో బాలీవుడ్ ను ఊపేసిన ‘త్రీ ఇడియట్స్’ సినిమాకు వాంగ్ చుక్ ప్రేరణగా ఆయన గుర్తు చేశారు. వాంగ్ చుక్ ప్రయోగాల స్ఫూర్తితోనే త్రీ ఇడియట్స్ సినిమాను తీసినట్లు గుర్తు చేశారు.