ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు భారీగా వీడుతున్నారు.. కారణమేంటి?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా దూసుకుపోతున్న తరుణంలో సంస్థ అంతర్గతంగా ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది.

Update: 2026-07-16 11:30 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా దూసుకుపోతున్న తరుణంలో సంస్థ అంతర్గతంగా ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. చంద్రయాన్, ఆదిత్య-ఎల్1 వంటి చారిత్రాత్మక విజయాలతో దేశ కీర్తిని దశదిశలా చాటిన ఇస్రోలో ప్రస్తుతం అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గగన్‌యాన్ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో నిపుణులు సంస్థను వీడటం కేంద్ర ప్రభుత్వాన్ని సైతం అప్రమత్తం చేసింది.

కలవరపెడుతున్న వలసలు.. వందకు పైగా రాజీనామాలు

అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇస్రో నుంచి దాదాపు 100 నుండి 120 మంది వరకు శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇందులో కేవలం జూనియర్ పరిశోధకులే కాకుండా దశాబ్దాల అనుభవం ఉండి కీలక ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ సైంటిస్టులు కూడా ఉండటం గమనార్హం. అంతరిక్ష రంగంలో ప్రతి శాస్త్రవేత్త నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో విలువైంది. ఇలాంటి తరుణంలో ఇంతమంది నిపుణులు ఒకేసారి బయటకు వెళ్లడం వల్ల కీలక మిషన్ల నాణ్యత, పనుల వేగం , గడువులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ఇస్రోను ఎందుకు వీడుతున్నారు?

ఇస్రో లాంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థను వదిలి శాస్త్రవేత్తలు బయటకు రావడానికి ప్రధానంగా కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించిన తర్వాత దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లు, కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇస్రోలో లభించే ప్రభుత్వ వేతనాల కంటే ఈ ప్రైవేట్ కంపెనీలు శాస్త్రవేత్తలకు భారీ జీతాలు, మెరుగైన ప్రోత్సాహకాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల పరిధిలో ప్రమోషన్లు, కెరీర్ వృద్ధి నెమ్మదిగా సాగుతుండటంతో వేగవంతమైన వృద్ధిని ఆశించే యువ శాస్త్రవేత్తలు ప్రైవేట్ రంగానికి మొగ్గు చూపుతున్నారు. మిషన్ల గడువులు దగ్గర పడుతున్న కొద్దీ పెరిగే పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి.

రంగంలోకి దిగిన కేంద్రం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కఠిన నిబంధనలు

శాస్త్రవేత్తల వలసలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యంగా గగన్‌యాన్ ప్రాజెక్టుపై దీని ప్రభావం పడకుండా చూసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ రంగంలోకి దిగింది. ఇస్రో కేంద్రాలకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ముఖ్యమైన మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను లేదా స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను స్థానిక కేంద్రాలు నేరుగా ఆమోదించవద్దని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థనను తుది నిర్ణయం కోసం నేరుగా డీవోఎస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించింది. నిపుణులైన మానవ వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఒక పెద్ద సవాలు

ఒక సీనియర్ శాస్త్రవేత్త సంస్థను వీడితే అది కేవలం ఒక ఉద్యోగిని కోల్పోవడం కాదు. దశాబ్దాల పరిశోధనల అనుభవాన్ని కోల్పోవడం. అంతరిక్ష ప్రాజెక్టులు అత్యంత క్లిష్టమైనవి. సీనియర్ల అనుభవాన్ని, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త తరం శాస్త్రవేత్తలకు బదిలీ చేయడం రాత్రికి రాత్రి జరిగే పని కాదు. దీనివల్ల ప్రాజెక్టుల పురోగతి మందగించే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న కఠిన నిబంధనలు తాత్కాలికంగా రాజీనామాలను అడ్డుకోగలవు కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి ఇస్రోలో ప్రతిభావంతులను దీర్ఘకాలికంగా నిలుపుకోవాలంటే పని వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలి. ప్రైవేట్ రంగానికి పోటీగా మెరుగైన ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్‌లు అందించాలి. కెరీర్ పురోగతికి మరింత వేగవంతమైన అవకాశాలు కల్పించాలి.

భారత అంతరిక్ష విజయాల వెనుక ఉన్న అసలైన శక్తులు మన శాస్త్రవేత్తలే. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారానే ఇస్రో తన విజయ పరంపరను నిరంతరాయంగా కొనసాగించగలదు.

Tags:    

Similar News