కూటమికి కీలకం: బీసీల రిజర్వేషన్..!
ఈ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.;
రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కూటమి గత ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీ. వచ్చే ఎన్నికల నాటికి దీనిని సాకారం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని సర్కారు లెక్కిస్తోంది. బీసీల గణన కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. అయితే... 34 శాతం మేరకు బీసీలకు రిజర్వేషన్ కల్పన విషయంపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేప థ్యంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ సాకారం అవుతుందా? అనేది ప్రశ్న.
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం.. బీసీలకు 33 శాతం అమలు చేయడమే ఇబ్బందిగా మారింది. ఇప్పుడు గత ఎన్నికల ఆధారంగా 34 శాతం మేరకు రిజర్వేషన్ అమలు చేస్తే.. అది 55 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగని దీనిని విస్మరించే పరిస్థితి లేదు. తెలంగాణలో బీసీలకు 43 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదన వీగిపోయింది. ఇప్పటికీ ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తేల్చ లేకపోయింది.
న్యాయపరమైన వివాదాలు, కోర్టు తీర్పులు అనేక విషయాలు దీనికి ముడిపడి ఉన్నాయి. దీంతో ఏపీలో 34 శాతం అమలు వ్యవహారం సర్కారుకు తలకు మించిన భారంగా మారుతుందా లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం మిశ్రాకమిటీ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. అనంతరం.. సెప్టెంబరు నాటికి రిజర్వేషన్ ఖరారు చేసి.. స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న దిశలో సర్కారు ఉంది. 34 శాతం రిజర్వేషన్‌ను తాము గతంలోనే అమలు చేశామని చెబుతున్న ప్రభుత్వం వైసీపీ సర్కారు దీనిని కుదించిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమేరకు పెంచుతారన్నది ఆసక్తిగా మారింది. ఇది సక్సెస్ అయితే.. సర్కారుకు తిరుగు ఉండదని అంటున్నారు.