'సభ' ముగిసింది.. ఫలితం వచ్చిందా.. !
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 23 కీలక బిల్లులను ఆమోదించారు.;
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 23 కీలక బిల్లులను ఆమోదించారు. అయితే, యధావిధిగా ప్రతిపక్షం వైసిపి ఈ సభలకు కూడా డుమ్మా కొట్టింది. గతంలో కూడా వైసీపీ సభ్యులు సభకు రాని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా సభకు రాబోమని ముందుగానే వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. దాని ప్రకారమే వైసీపీ సభ్యులకి ఎన్నిసార్లు విన్నపాలు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే సభలో ప్రతిపక్ష- అధికారపక్ష పాత్రలను తామే పోషిస్తున్నామని చెప్పిన టిడిపి, జనసేన, బిజెపి సభ్యుల వ్యవహార శైలి ఆశాంతం భిన్నంగా కనిపించడం విశేషం.
ఈ మాటను స్వయంగా సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజల సమస్యల మీద ప్రస్తావించడం తప్పు కాకపోయినా, వ్యక్తిగత అజెండాలను పెట్టుకుని ప్రశ్నించడం, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం వంటివి సభలో కనిపించాయి. దీనికి తోడు ఒకరిద్రు నాయకులు సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. తొలి రోజు నుంచి దాదాపు 40 శాతానికి మించి సభ హాజరు కాలేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడే చెప్పటం విశేషం. నిజానికి వైసిపి ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని, వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో అధికార కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా 40 శాతానికి మించి సభకు హాజరు కాలేదని చివరి రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దీంతో వైసిపి పై చర్యలు తీసుకోవాలన్న వాదన దాదాపు వీగిపోయింది. ఇది ఒక ప్రధాన విషయం. వివాదాల విషయానికొస్తే.. నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా టార్గెట్ చేయడం.. పెను సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. ఇక, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అటు చిరంజీవిని ఇటు వైసీపీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఈ పరిణామాలు అసెంబ్లీలో వేడిని రగిలించాయనే చెప్పాలి. ఇక కూన రవికుమార్ నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎనిమిది రోజుల కాలంలో నిర్వహించిన సభలో తీవ్ర వివాదానికి దుమారానికి కూడా కారణంగా మారాయి. సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని సభలో ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే సజావుగానే సాగినప్పటికీ పొగడ్తలు, ప్రశంసలు శృతిమించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయటం మరింత విశేషమని చెప్పాలి.