రఘురామ కామెంట్స్ పై వైసీపీ ఘాటు రిప్లై.. చరిత్ర మరచిపోయారా అంటూ కౌంటర్ అటాక్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.;
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రఘురామ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలపై అనర్హత వేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదని, చరిత్రను మార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తే తగిన విధంగా పోరాడుతామని హెచ్చరిస్తోంది.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్షం వైసీపీని రప్పించాలని ప్రభుత్వం తెగ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన గైర్హాజరుకు ప్రధాన కారణం ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వకపోవడమేనని జగన్ చెబుతున్నారు. సభలో నాలుగు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభా నాయకుడితో సమానంగా మాట్లాడే సమయం వస్తుందని, అప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ చెబుతున్నారు.
అయితే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇస్తామని ప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీకి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రాజంపేటలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత రెండు రోజులుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు మరో అడుగు ముందుకేసి జగన్ అసెంబ్లీకి రాకపోతే, పులివెందులకు ఉప ఎన్నిక ఖాయమంటూ కామెంట్స్ చేశారు. ఎవరైనా సభ్యుడు 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఆయన తన వాదనకు మద్దతుగా నిబంధనలు చూపుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయం అంటూ ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీ కౌంటర్ అటాక్ మెదలు పెట్టింది. తొలుత డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకుని వైసీపీ... టీడీపీ సోషల్ మీడియా విజృంభణతో షాక్ తిన్నట్లు చెబుతున్నారు. దీంతో రఘురామ వ్యాఖ్యలను కోట్ చేస్తూ మాజీ మంత్రి అంబటితోపాటు వైసీపీకి చెందిన కీలక నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేసినట్లు చరిత్రలో ఒక్క సంఘటనను అయినా చూపిస్తారా? అంటూ సవాల్ వేస్తున్నారు.
ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు ఏడాదిన్నరపాటు అసెంబ్లీకి రాలేదని, ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ఇలాంటి బెదిరింపులకు దిగలేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో 1989-1994 మధ్య కూడా నాటి ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించి తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ దాదాపు మూడేళ్లు అసెంబ్లీకి రాకపోయినా, ఇలాంటి బెదిరింపులు వినలేదని అంటున్నారు. ఇప్పటి వరకు లేని సంప్రదాయాన్ని తీసుకువస్తారా? అంటూ వైసీపీ నిలదీస్తుంది. అయినా అనర్హత వేటు వేస్తే చూస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.
శాసనసభ్యులు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అక్కడి ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. తన గైర్హాజరుకు ఆయన ఎలాంటి సాకులు చూపకపోయినప్పటికీ, అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ హైదరాబాదు నగరం వైపే చూడటం మానేశారు. పదవి కోల్పోయిన తర్వాత ఎర్రవెళ్లి ఫాం హౌస్ కి వెళ్లిపోయిన కేసీఆర్, ఆ తర్వాత ఒకటి రెండు సందర్బాల్లో మాత్రమే హైదరాబాద్ కు అసెంబ్లీకి వచ్చారు. ఇక ఏపీలోనూ వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి రావడం లేదు. తన గైర్హాజరుకు ప్రభుత్వం తీరే కారణమంటూ జగన్ చెబుతున్నారు. అయితే జగన్ ను ఎన్ని రోజులు నుంచి అసెంబ్లీకి రానిది లెక్కిస్తున్న ప్రభుత్వం తరచూ ఆయనపై అనర్హత వేటువేస్తామని ప్రచారం చేయడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ హెచ్చరికలపై ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న వైసీపీ ఇప్పుడు దీటుగా సమాధానం చెబుతుండటంతో ‘అనర్హత’పై తాడోపేడో తేల్చేసుకోవడమే అన్న సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.