దళపతికి సింగం సవాల్.. తమిళ పాలిటిక్స్ లో భారీ కుదుపు?

తమిళనాడు పాలిటిక్స్ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సంప్రదాయ ద్రవిడ పార్టీల స్థానంలో కొత్త పార్టీల శకం ప్రారంభమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

Update: 2026-06-02 20:06 GMT

తమిళనాడు పాలిటిక్స్ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సంప్రదాయ ద్రవిడ పార్టీల స్థానంలో కొత్త పార్టీల శకం ప్రారంభమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చిన దళపతి విజయ్ కొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ఆయనకు పోటీగా మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. త్వరలో ప్రారంభమయ్యే ఆ కొత్త పార్టీకి మాజీ పోలీస్ అధికారి అన్నామలై సారథ్యం వహించనున్నారనే సంకేతాలు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి.

బీజేపీపై అసంతృప్తి!

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సొంతంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ ను ఊపేస్తున్నాయి. అటు చెన్నై నుంచి ఇటు ఢిల్లీ వరకు ప్రస్తుతం అన్నామలై కదలికలపైనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంతో అన్నామలై అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఏఐడీఎంకేతో పొత్తు పెట్టకోడాన్ని అన్నామలై తీవ్రంగా విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఇక అంతకుముందే తమిళనాడు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం తప్పుకున్న అన్నామలై పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

రెండు రోజుల్లో క్లారిటీ

ఈ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతోందని అంటున్నారు. ఇదే సమయంలో కొత్తపార్టీపై జరిగిన ప్రచారాన్ని ఖండించకుండా..తన నిర్ణయాన్ని తెలియజేయడానికి దయచేసి రెండు రోజులు వేచి ఉండాలని, ఆ తర్వాత అందరం కూర్చుని ఫ్రీగా మాట్లాడదామని అన్నామలై వ్యాఖ్యానించడంతో అనుమానాలు నిజమయ్యే చాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆయన అభిమానులు కోయంబత్తూరు, చెన్నైల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టేస్తూ హంగామా మొదలుపెట్టారు. అంతేకాదు, తమిళగ మక్కల్ శక్తి కట్చి అనే పేరుతో ఆయన కొత్త పార్టీని కూడా రిజిస్టర్ చేయబోతున్నారనే టాక్ తమిళ వెబ్‌సైట్లలో మార్మోగిపోతోంది.

ద్రవిడ పార్టీలు క్లోజ్?

ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల శకం ముగియనుందా? అన్న విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీఎంకే ఓడిపోవడం, అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోవడంతో టీవీకే ఆధిపత్యమే కొనసాగుతోంది. డీఎంకే బాస్ స్టాలిన్ వయసు కూడా ఏడు పదులు దాటడం వల్ల భవిష్యత్తులో ఆయన డీఎంకే పార్టీకి సారథ్యం వహించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో తమిళనాడులో విజయ్ కి పోటీగా అన్నామలై నేతృత్వంలోని కొత్త పార్టీ బలపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో గత కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు ఇద్దరు వ్యక్తుల మధ్యే కొనసాగిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు.

హీరో వర్సెస్ ఐపీఎస్

తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే, కరుణానిధి, ఎంజీఆర్ మధ్య దశాబ్దాల పాటు రాజకీయ పోరు జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలితగా యుద్ధం మారింది. కరుణా నిధి అద్భుతమైన వక్త, స్క్రీన్ ప్లే రైటర్ కాగా, ఎంజీఆర్ మాస్ హీరోగా నిలిచారు. జయలలిత కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే.. అయితే ఇప్పుడు సినీ స్టార్ నుంచి సీఎం అయిన విజయ్ ఒకవైపు ఉండగా, అద్భుత వాక్చుతుర్యం ఉన్న అన్నామలై కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేస్తుందని అంటున్నారు.

అన్నామలై దూకుడుతో గుర్తింపు

దళపతి విజయ్ సరిగ్గా ఎంజీఆర్ తరహాలోనే అశేష ప్రజాదరణ, మాస్ ఇమేజ్, అభిమాన సంఘాల బలంతో సీఎం సీటును దక్కించుకోగా, అన్నామలై పదునైన విమర్శలు, దూకుడు రాజకీయం, వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న మాజీ ఐపీఎస్ అధికారిగా యువతలో డిజిటల్ క్రేజ్ సంపాదించుకున్నారని అంటున్నారు. దీంతో సినిమా గ్లామర్ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అన్నట్లుగా తమిళ రాజకీయం మారబోతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యవస్థలో మార్పు!

ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తమిళనాడులో సాంప్రదాయ ద్రవిడ పార్టీల పట్ల ప్రజల్లో ఉన్న కొంత అసంతృప్తిని బయటపెట్టాయంటున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన విజయాన్ని అన్నామలై స్వయంగా వ్యవస్థలో వచ్చిన ఊహించని మార్పుగా అభివర్ణించారు. ఉచితాల సంస్కృతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న ఈ తరుణంలో, అన్నామలై జాతీయ పార్టీ ముద్రను పక్కనపెట్టి, పక్కా లోకల్ సెంటిమెంట్‌తో సొంత పార్టీ పెడితే అది డీఎంకే, ఏఐఏడీఎంకేలకు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషిస్తున్నారు. అన్నామలై గనుక బీజేపీకి గుడ్ బై చెప్పి సొంత జెండా ఎగరేస్తే, తమిళనాడులో దశాబ్దాల నాటి ద్రవిడ కోటలు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ప్రధాన పోటీ విజయ్ వర్సెస్ అన్నామలై అనే ఇద్దరు నాన్-ద్రవిడియన్ నేతల మధ్యే సాగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News