లవర్ తల్లిని చంపడం తప్పేం కాదు.. నిందితుడి తల్లి సంచలన కామెంట్స్!
జీడిమెట్లలో చోటుచేసుకున్న అంజలి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై నిందితుడు శివ తల్లి సంతోషి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.;
జీడిమెట్లలో చోటుచేసుకున్న అంజలి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై నిందితుడు శివ తల్లి సంతోషి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. "అంజలిని చంపడం కరెక్టే, ఆమె వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది" అని ఆమె వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
-ప్రేమలో అడ్డుకోవడమే హత్యకు కారణం?
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) హైదరాబాద్‌లో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తూ వచ్చింది. పెద్ద కూతురు (15) స్థానికంగా ఉన్న జెడ్పీ హెచ్ఎస్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. చిన్న కూతురు ఎనిమిదో తరగతిలో ఉంది. ఇదే క్రమంలో పెద్ద కూతురికి నల్గొండ జిల్లా కట్టంగూర్‌కు చెందిన శివ అనే 18 ఏళ్ల యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దాదాపు 8 నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ వ్యవహారాన్ని తల్లి అంజలి గమనించి తీవ్రంగా వ్యతిరేకించింది. అదే సమయంలో ఆమె శివపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదై పోలీసులు వారి మధ్య ఉన్న సంబంధాన్ని విచారించారు.
- తల్లిని హత్యకు ప్రేరేపించిన కూతురు?
శివతో విడిపోవాలని తల్లి చెప్పిన మాటలు పెద్ద కూతురికి నచ్చలేదు. తల్లి తన ప్రేమకు అడ్డుగా మారిందని భావించిన ఆమె, శివను ఫోన్‌లో బెదిరించి "నీవు నన్ను పెళ్లి చేసుకోలేకపోతే.. తల్లిని చంపకపోతే, నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా" అని ఒత్తిడి చేసింది. ఈ ఒత్తిడితో శివ తన తమ్ముడిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి, అంజలిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్లాన్‌లో శివ ప్రియురాలిదే ప్రధాన భూమికగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం శివ, అతడి తమ్ముడు పోలీసులు అరెస్టు చేశారు. కేసు కింద విచారణ కొనసాగుతోంది.
- నిందితుడి తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు
అంజలిని హత్య చేయడాన్ని సమర్థిస్తూ శివ తల్లి సంతోషి మీడియాతో మాట్లాడింది. “ఆమెనే కారణం మా కొడుకు జీవితం నాశనం కావడానికి... ఆమెను చంపడం తప్పుడు కాదు. ఈ రోజు కాదు రేపైనా నా కొడుకులను బయటకు తేవాల్సిందే” అంటూ చట్టాన్ని గౌరవించని విధంగా మాట్లాడింది. అంతేకాదు “అసలు విషయం మృతురాలి కూతురికే తెలుసు. ఆమెను విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయి,” అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు, మహిళా సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ప్రస్తుతం పోలీసు విచారణ వేగంగా కొనసాగుతోంది. నిందితులపై హత్య, పోక్సో తదితర కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలిక పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు, ఆమె పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.