అనిల్ కుమార్ యాదవ్‌కు మళ్లీ నోటీసులు.. అరెస్టు ఖాయమా?
మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.;
మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం కోర్టుకు వెళ్లగా, ఆయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలని కోర్టు సూచించింది. ఇదే సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదుపై ఏ1 నిందితుడు ప్రసన్నకుమార్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించగా, ఏ2 అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. జులై 26న విచారణకు రమ్మంటూ 23వ తేదీన నోటీసులిచ్చారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు అంటించారు. అయితే తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసు వేసినందున అనిల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో తాజాగా పోలీసులు రెండో నోటీసు పంపారు. వచ్చేనెల 4వ తేదీన విచారణకు రమ్మంటూ కోవూరు పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే కేసు హైకోర్టులో పెండింగులో ఉన్న కారణంగా అనిల్ హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పోలీసు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుతోపాటు అక్రమ మైనింగులోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అక్రమ మైనింగు వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు బి.శ్రీకాంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులోనూ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జైలులో ఉన్న వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు కాకాణిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న ప్రచారం వేడి పుట్టిస్తోంది.