ఆంధ్రుల విద్యా దేవాలయం : ఏయూ వందేళ్ల ప్రస్థానం

విశాఖలో ప్రఖ్యాత ఆంధ్ర విశ్వ విద్యాలయం వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. 1926లో ప్రారంభమైన ఏయూ ఆంధ్రుల విద్యా దేవాలయంగా వర్థిల్లుతోంది.;

Update: 2026-04-18 05:17 GMT

విశాఖలో ప్రఖ్యాత ఆంధ్ర విశ్వ విద్యాలయం వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. 1926లో ప్రారంభమైన ఏయూ ఆంధ్రుల విద్యా దేవాలయంగా వర్థిల్లుతోంది. ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకు పది రోజుల పాటు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వర్సిటీ వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో అనుబంధ కళాశాల ఆధ్వర్యంలో ‘ఏ సెంచరీ ఆఫ్ పార్టనరషిప్’ అంశంపై కార్యక్రమం జరగనుంది. మొత్తం పది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బెజవాడ నుంచి విశాఖకు..

ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే ఉద్దేశంతో 1926 ఏప్రిల్ 26న ఏయూని ప్రారంభించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీని తొలుత బెజవాడలో ప్రారంభించారు. 1930లో ఏయూని విశాఖపట్నం తరలించాలని నిర్ణయించారు. సముద్ర తీరాన, ప్రకృతి ఒడిలో విద్యాబోధన సాగాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలా వాల్తేరు కొండల్లో మొదలైన వర్సిటీ ప్రస్తుతం ప్రపంచ స్థాయి పరిశోధనలకు నిలయంగా మారింది. "తేజస్వినావధీతమస్తు" (మా చదువు మాకు ప్రకాశాన్ని ఇచ్చుగాక) అనే నినాదంతో ప్రారంభమైన ఏయూ ప్రస్థానం నేడు శతాబ్ది వేడుకలకు చేరుకోవడం తెలుగువారికి గర్వకారణం. కేవలం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా, రాబోయే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో కూడా ఏయూ అడుగులు వేస్తోంది.

సాంస్కృతిక వారసత్వ చిహ్నం

వందేళ్ల చరిత్ర లో ఏయూ కేవలం ఒక విద్యా సంస్థగానే కాకుండా ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా నిలిచింది. ఎందరో ప్రముఖులను తీర్చిదిద్దింది. కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థగానే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన మేధో సంపత్తిని అందించే 'నాలెడ్జ్ హబ్'గా విరాజిల్లుతోంది. దేశంలో మెరుగైన విద్యాసంస్థలకు ఇచ్చే నాక్ గుర్తింపును పొందడంలో ఏయూ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి స్టేట్ యూనివర్సిటీ కేటగిరీలో ఏయూ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది.

400 ఎకరాల్లో అక్షర సామ్రాజ్యం

విశాఖ నగర నడిబొడ్డున సుమారు 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన వర్సిటీ క్యాంపస్ ఒక అద్భుతమైన విద్యా నిలయంగా చెబుతారు. వాల్తేరు కొండల్లో ప్రకృతి అందాల మధ్య, సముద్రపు గాలి పలకరింపుల మధ్య ఇక్కడి విద్యాబోధన సాగుతుంది. ఒడిశాలోని జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ అందించిన భూములు, నిధులతో క్యాంపస్ భవనాలు రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అందుకే సైన్స్ కాలేజీకి ఆయన పేరును పెట్టారని అంటున్నారు. ఇక ఏయూలో పరస్పర భిన్నమైన విభాగాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతూ ప్రత్యేకత చాటుకుంటోంది. దేశంలో న్యూక్లియర్ ఫిజిక్స్‌ను ఒక ప్రత్యేక విభాగంగా ప్రవేశపెట్టిన తొలి వర్సిటీలలో ఏయూ ఒకటి. ఇది కేవలం మెదడుకు మేత వేయడమే కాకుండా, విద్యార్థుల్లోని కళాత్మక హృదయాన్ని కూడా తట్టి లేపుతుంది.

పరిశ్రమల చెలిమి - కొలువుల కలిమి

నేటి పోటీ ప్రపంచంలో ఏయూ తన రూపురేఖలను మార్చుకుంటూ ‘నాలెడ్జ్ హబ్’గా అవతరించింది. విశాఖ చుట్టుపక్కల ఉన్న ఫార్మా, స్టీల్, పెట్రో కెమికల్ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో ఏయూది కీలక పాత్రగా చెబుతారు. ఇక భారత నౌకాదళంతో కలిసి ప్రత్యేక కోర్సులను నిర్వహించడం ఏయూకే సొంతమైన ప్రత్యేకత. అంతేకాకుండా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు అత్యాధునిక 'ఇంక్యుబేషన్ సెంటర్లను' ఇక్కడ ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులకు నూతన సాంకేతికతలో శిక్షణ ఇస్తున్నారు.

Tags:    

Similar News