రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్ట్.. క్యూలో అదానీ, అంబానీ, వేదాంత కంపెనీలు!!
ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసే మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయని అంటున్నారు.
ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసే మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయని అంటున్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రక్షణ రంగ అవసరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) మైనింగ్, ప్రాసెసింగ్‌లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ భారీ కారిడార్ ను దక్కించుకోడానికి ఏపీ సర్కార్ అత్యంత వ్యూహాత్మకంగా దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఏపీకి ఉన్న అతిపెద్ద బలం
దేశంలోనే రెండో అతి పెద్ద సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్రత్యేకతే రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ దక్కించుకునేలా మార్గం సుగమం చేస్తోందని చెబుతున్నారు. తీర ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం ఏపీలో దాదాపు 211 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖనిజ వనరులు దాగి ఉన్నాయి. ఈ భౌగోళిక, వ్యూహాత్మక అనుకూలతలే ఇప్పుడు ఏపీని రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టుకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చబోతున్నాయని చెబుతున్నారు. ఈ అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించేందుకు దేశంలోని అగ్రశ్రేణి కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు అయిన రిలయన్స్, అదానీ గ్రూప్, వేదాంత వంటి దిగ్గజాలతో పాటు మరో 10 ప్రముఖ కంపెనీలు ఏపీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా టైటానియం, రేర్ ఎర్త్ క్లస్టర్లను ఏర్పాటు చేసి, తద్వారా దాదాపు రూ. 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెబుతున్నారు.
చైనా గుత్తాధిపత్యానికి చెక్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉందని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఈవీ బ్యాటరీలు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీకి ఈ ఖనిజాలు అత్యవసరంగా చెబుతున్నారు. ఈ పరికరాల కోసం చైనాపై ఈ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని మన దేశం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లను ప్రతిపాదించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత కీలకమైన హబ్‌గా మారేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.
మంత్రి నారా లోకేష్ క్రేజీ ట్వీట్:
ఈ ప్రాజెక్టుపై ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ చేసిన ట్వీట్ పై ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇది అద్భుతం! మైనింగ్, ప్రాసెసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థలు క్యూ కడుతున్న ఆ ప్రోగ్రెసివ్ రాష్ట్రం ఏదో తెలుసా? అంటూ ట్వీట్ చేశారు. అన్నిటికంటే శక్తివంతమైన అరుదైన ఖనిజం మంచి విధానమే అని తేలింది! అంటూ రాశారు. దీనిద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు కోసం ఏపీ రేసులో ఉందన్న విషయాన్ని మంత్రి వెల్లడించారని అంటున్నారు.