టీడీపీ, వైసీపీ ఈ యుద్ధం ఎంతవరకు?

ఢీ అంటే ఢీ అన్నట్లే వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం ఎప్పుడూ హైటెన్షన్ ఓల్టేజ్ గా మారింది.;

Update: 2025-06-23 12:37 GMT

ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా కొనసాగుతోంది. ప్రతి రోజు ఓ ఫైనల్ మ్యాచులా భావిస్తూ అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తులతో పావులు కదుపుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రెడ్ బుక్ రాజ్యాంగమంటూ యుద్ధం ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. ఏడాదిగా ఎక్కడా రాజీపడకుండా పోరాటాలకు రూపకల్పన చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ కూడా కేసులు, అరెస్టులతో వైసీపీ నేతలను హడలెత్తిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీని ఖాళీ చేసే పనిని సమాంతరంగా అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో గత ప్రభుత్వ లోపాలంటూ అప్పటి అస్తవ్యస్త విధానాలను సరిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పటి అక్రమాలకు బాధ్యులుగా కొందరి అధికారులను అరెస్టు చేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కాంలో నాటి సీఎంవోలో కీలకంగా పనిచేసిన అధికారులను అరెస్టు చేయించిన ప్రభుత్వం తాజాగా మాజీ సీఎం జగన్ పైనా రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేసి తగ్గేదేలే.. అన్నసంకేతాలు పంపింది.

మరోవైపు ప్రభుత్వ నిర్బంధాన్ని వైసీపీ కూడా లెక్కచేయడం లేదు. ఢీ అంటే ఢీ అన్నట్లే వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం ఎప్పుడూ హైటెన్షన్ ఓల్టేజ్ గా మారింది. ఎప్పుడు ఎవరిని షాక్ కొడుతుందో.. ఎవరు అరెస్టు అవుతారో అన్నదే ప్రధాన చర్చగా మారింది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర విభజన నుంచి రాష్ట్రంలో విస్తరించినా, ఇప్పుడు బాగా తీవ్రమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అధికార, విపక్షాల మధ్య ఈ వార్ కు ముగింపే లేదా? అని ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఇలాంటి యుద్ధమే కొనసాగినా, ఇంతటి తీవ్రత ఎప్పుడూ లేదని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయం మొత్తం రెండు పక్షాల మధ్యే కేంద్రీకృతయవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాలు ఉండేవని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంతోపాటు మరికొన్ని ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కీలకంగా పనిచేయడం వల్ల ప్రభుత్వ నిర్బంధం ఎక్కువ ఉండేది కాదని అంటున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి విపక్షంగా ఉండేది. ఆ సమయంలో కమ్యూనిస్టులు, బీజేపీ, లోక్ సత్తా, బీఎస్పీ వంటి పార్టీలు ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వంపై పోరాడే పరిస్థితులు ఉండేవని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. టీడీపీ లేదా వైసీపీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంతో మిగిలిన పార్టీలు టచ్ మీ నాట్ అన్నట్లు ఉండటం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయంటున్నారు. దీంతో రాజకీయ అశాంతి నెలకొంటుందని అంటున్నారు.

ప్రధానంగా వైసీపీ హయాంలో ఎక్కువగా సాగిన అరెస్టుల సంస్కృతి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత ఎక్కువైందని అంటున్నారు. అయితే నేరాలు, దూషణలకు దిగిన వారినే అరెస్టు చేయిస్తున్నామని చెబుతున్నా, ఓ ప్రణాళిక ప్రకారమే ఈ అరెస్టులు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై జరగాల్సిన చర్చ పక్కకు పోయి రెండు పక్షాల మధ్య వాదనలు, దూషణలే ప్రధాన అజెండాగా మారిపోయిందని అంటున్నారు. దీనివల్ల ప్రజా సమస్యలు వెనక్కివెళ్లిపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయం పోయి స్నేహపూర్వక రాజకీయాలు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్న టీడీపీ, వైసీపీ నుంచి చొరవ చూపాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News