ప‌న్నులు క‌ట్టాల్సిందే.. ప‌వ‌న్ ఆగ్ర‌హం

ఏపీలోని పంచాయ‌తీరాజ్ ప‌రిధిలో ఉన్న అన్ని సంస్థ‌లు ప‌న్నులు చెల్లించాల్సిందేన‌ని ఉప ముఖ్య‌మంత్రి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు.

Update: 2026-06-02 09:30 GMT

ఏపీలోని పంచాయ‌తీరాజ్ ప‌రిధిలో ఉన్న అన్ని సంస్థ‌లు ప‌న్నులు చెల్లించాల్సిందేన‌ని ఉప ముఖ్య‌మంత్రి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. 5400 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌న్నులు బ‌కాయి పెట్ట‌డాన్ని ఆయ‌న తీవ్రంగా భావించారు. ఇలా చేయ‌డం వెనుక రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌న్న అధికారుల స‌మాచారంపై మ‌రింత మండి ప‌డ్డారు. ఏ పార్టీ అయినా.. ప‌న్నులు క‌ట్టడాన్ని నిరాక‌రించిందా? అలా అయితే.. ప్ర‌భుత్వానికి సొమ్ములు ఎక్క‌డ నుంచి వ‌స్తాయి? ఈ విధానం స‌రికాదు.. అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

పంచాయ‌తీల ప‌రిధిలో వ‌న‌రుల‌ను వినియోగించుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు ప‌న్నులు బ‌కాయి పెట్టా ర‌న్న విష‌యంపై తెలిసిన ఆయ‌న‌..ఆయా సంస్థ‌ల‌కు త‌క్ష‌ణ‌మే నోటీసులు ఇచ్చే విష‌యంపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల న్నారు. ఈ విష‌యంలో ఎవ‌రినీ ఉపేక్షించ‌రాద‌ని తేల్చి చెప్పారు. ``వారేమైనా ప్ర‌జ‌ల‌కు ఉచిత సేవ‌లు అందిస్తున్నారా? అవేమైనా స్వ‌చ్ఛంద సంస్థ‌లా.. భారీ ఎత్తున లాభాల‌ను ఆర్జిస్తూ.. ప్ర‌భుత్వానికి ప‌న్నులు క‌ట్ట‌క‌పోవ‌డం అంటే స‌రైన విధానం కాదు. ఈ విష‌యాన్ని చూస్తూ.. ఊరుకునేది లేదు`` అని చెప్పారు.

ఈ వ్య‌వ‌హారాన్ని సీఎం చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకువెళ్తాన‌ని చెప్పారు. ముఖ్యంగా ఇటీవ‌ల గోదావ‌రి కాలుష్యానికి కార‌ణ‌మైన‌.. ఆంధ్ర పేప‌ర్ మిల్లు ఏకంగా 13 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌న్నులు చెల్లించ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా భావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు ఎందుకు క‌ట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సామాన్యులు, చిరుద్యోగులు, రోడ్డుప‌క్క‌న వ్యాపారాలు చేసుకునే వారు కూడా ప్ర‌భుత్వానికి ప‌న్నులు క‌డుతున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. వారికంటే.. వీరేమైనా అతీతులా? అని ప్ర‌శ్నించారు. ఎవ‌రినీ ఉపేక్షించేది లేద‌ని..అంద‌రి నుంచి నిర్దేశిత స‌మ‌యంలో ప‌న్నులు వ‌సూలు చేయాల‌ని ఆదేశించారు.

5400 కోట్ల రూపాయ‌లు అంటే మాట‌లు కాద‌ని.. ప్ర‌భుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేప‌థ్యంలో ఈ సొమ్ము అత్యంత ఆవ‌స్య‌క‌మ‌ని పేర్కొన్నారు. ప‌న్నుల‌ను వ‌సూలు చేసే విష‌యంలో మ‌రింత పాద‌ర్శ‌క‌త తీసుకువ‌స్తామ‌న్నారు. పంచాయ‌తీల్లో వ‌న‌రుల‌ను వినియోగించుకుంటున్న వారు.. ప‌న్నులు చెల్లించ‌కుండా ఎగ్గొట్టే ధోర‌ణితోనో.. రాజ‌కీయ జోక్యంతోనో వ్య‌వ‌హ‌రిస్తే.. ఊరుకోవ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. పల్స్‌ సర్వే తరహాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పన్ను వసూళ్లు చేయాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News