అవయవ దానం : కొత్త జీవితాలు ఇస్తూ ఏపీ రికార్డు
రాష్ట్రంలో అవయవాలు ఆయుష్షు నిండి ఎదురుచూస్తున్న 1200 మంది బాధితులకు రాష్ట్ర జీవన్ దాన్ నూతన జీవితాలను ప్రసాదించింది.;
అవయవ దానం అన్నది ఒక గొప్ప మానవతా సేవా భావం. గతంతో పోలిస్తే అవయవ దానం మీద జనాలలో చైతన్యం పెరిగింది. చాలా మంది అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. మరణం తరువాత కూడా తమ అవయవాలు ఎందరికో ఉపయోగపడాలని ఆ విధంగా మరోసారి జన్మ ఎత్తి తాము ధన్యత పొందాలని అనేక మంది ఆలోచిస్తున్నారు. దాంతో దేశంలో అవయవ దానంలో ఏపీ ముందు వరసలోకి వచ్చింది.
రాష్ట్రానికి ఆరవ స్థానం :
ఇదిలా ఉంటే అవయవ దానంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అపెక్స్ బాడీ అయిన నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ రాష్ట్రాల వారీగా అవయవ దాన జాబితా-2025ను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే కనుక ఏపీకి మంచి ప్లేస్ లభించింది. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఏర్పాటు అయిన జీవన్ దాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తెస్తోంది అని అధికారులు చెబుతున్నారు.
అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు :
మరో వైపు చూస్తే ఇటీవల హైకోర్టు ప్రభుత్వాసుపత్రులలో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలో ఏపీలో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే ఆసుపత్రుల సంఖ్య మూడు నుంచి తొమ్మిదికి పెరిగింది. ఈ క్రమంలో విశాఖలోని కేజీహెచ్, విమ్స్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు నుంచి ఎనిమిది కిడ్నీలు, ఒక లివర్ మార్పిడి చేయగా రక్త సంబంధీకుల నుంచి 87 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా విజయవాడ శివారులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను స్వీకరించి గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి చేశారు.
మానవత్వం వెల్లి విరుస్తోంది :
మరో వైపు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదిలో కేవలం రెండు నెలల కాలంలోనే 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 64 అవయవాలు స్వీకరించి 64 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది గడిచిన రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే గణనీయంగా అవయవ దాన కేసులు పెరుగుతున్నాయి అనటానికి నిదర్శనంగా ఉంది. గత ఏడాది మొదటి రెండు నెలల్లో 12 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 31 అవయవ దాన మార్పిడి జరిగితే, 2024లో 10 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తులు నుంచి సహకరించిన 30 అవయవాల మార్పిడి జరిగాయి. ఈ ఏడాది మరింతగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు స్వీకరించి అవయవాలు కోసం ఎదురుచూస్తున్న బాధితులకు భరోసా కల్పించేందుకు జీవన్ దాన్ రంగం సిద్ధం చేస్తోంది.
వారందరికీ నూతన జీవితాలు :
రాష్ట్రంలో అవయవాలు ఆయుష్షు నిండి ఎదురుచూస్తున్న 1200 మంది బాధితులకు రాష్ట్ర జీవన్ దాన్ నూతన జీవితాలను ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించి బాధితులకు అండగా నిలుస్తూ వారి జీవితాలకు కొత్త వెలుగులు నింపింది. అలాగే గత ఏడాది కాలంలోనే 301 మంది బాధితులకు నూతన జీవితాలను ప్రసాదించి సరికొత్త చరిత్రను రాష్ట్ర జీవన్ దాన్ సృష్టించింది.
అవయవాల కోసం ఎదురుచూపులు :
ఇక రాష్ట్రంలో 20-50 ఏళ్ల వయసు మధ్యలో ఎక్కువ మంది అవయవాలు విఫలమై బాధపడుతున్నట్లు రాష్ట్ర జీవన్‌దాన్ ట్రస్ట్ పేర్కొంది. ట్రస్టులో ఇప్పటి వరకు 5347 మంది పలు అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో అధికంగా యువకులే ఉండటం గమనార్హం. ఉత్పాదక వయసులోనే అవయవ వైఫల్యంతో చిక్కిశల్యమవుతుండటంతో వారి వ్యక్తిగత జీవితంలోనే గాక సామాజికంగానూ తీవ్ర నష్టం కలుగుతోంది. అలాగే అవయవ దాతల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 9 ఏళ్లలోపు పిల్లలు 38 మంది ఉన్నారు.
కూటమి ప్రభుత్వం సహకారం :
ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించే విధంగా వాళ్లకి గౌరవం కల్పించేడానికి జారీ చేసిన జీవో 95 ద్వారా అవయవ దానం చేసిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కరణలు జరుగుతున్నాయి. అలాగే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించటం జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక సాయం రూ. లక్ష వరకు పెంచే విషయఒ ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.