లిక్కర్ స్కాంపై మాట్లాడని వైసీపీ సీనియర్లు.. బొత్స, ధర్మాన మౌనమెందుకు?
ఏపీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్ష వైసీపీ టార్గెట్ గా పావులు కదుపుతున్న ప్రభుత్వం విపక్ష నేత జగన్ చుట్టూ ఉచ్చుబిగించేలా అడుగులు వేస్తోంది.;
ఏపీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్ష వైసీపీ టార్గెట్ గా పావులు కదుపుతున్న ప్రభుత్వం విపక్ష నేత జగన్ చుట్టూ ఉచ్చుబిగించేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ అంశమై దాఖలు చేసిన చార్జిషీటులో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించడంతోపాటు నేడో రేపో ఆయనను అరెస్టు చేస్తామన్న ప్రచారాన్ని ఉదృతం చేసింది. ఈ స్కాంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని భావిస్తున్న ప్రభుత్వం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కూటమి నుంచి ఎవరు ప్రజల మధ్యకు వచ్చిన లిక్కర్ స్కాంపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నారని మండిపడుతూ.. త్వరలో బిగ్ బాస్ ను అరెస్టు చేస్తామని ప్రకటిస్తున్నారు. కొందరైతే నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావిస్తూ ఆయన మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రకటనలతో రచ్చ రేపుతున్నారు.
నోరు మెదపని సీనియర్లు
లిక్కర్ స్కాంపై దర్యాప్తునకు సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం.. అదే సమయంలో రాజకీయంగా విపక్షంపై పైచేయి సాధించేలా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. అయితే ఈ విషయమై వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందా? అన్న భావన వ్యక్తమవుతోంది. లిక్కర్ స్కాం నమోదైన తొలినాళ్లలో ఇదో అక్రమ కేసుగా పేర్కొన్న వైసీపీ రానురాను డిఫెన్స్ లో పడిపోతోందని అంటున్నారు. కూటమి సర్కారుకు దీటుగా వైసీపీలో దిగ్గజాలు వంటి నేతలు ఉన్నా ఎవరూ ఈ విషయమై నోరు మెదపకపోవడంతో రాజకీయంగా నష్టం జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ బాస్ జగన్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతున్నా, అందుకు దీటైన వ్యూహం రచించడంలో వైసీపీ విఫలమైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా?
ప్రధానంగా లిక్కర్ స్కాంలో వైసీపీకి చెందిన మాజీ నేత విజయసాయిరెడ్డిని దూరం చేసుకోవడంతో మొదలైన వ్యూహాత్మక తప్పిదం.. ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేసినా, విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాతే ఏ1 రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి వరుసగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల మాజీ సీఎం జగన్ కు వెన్నుదన్నులా నిలిచిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు వరకు చూస్తే ప్రభుత్వ జోరును అడ్డుకోవడంలో వైసీపీ విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యూహాలను పసిగట్టడం, వాటిని తిప్పికొట్టడంలో వైసీపీ నేతలు వెనకబడ్డారని పరిశీలకులు భావిస్తున్నారు.
నిందితుల వాదనతో సరి
ప్రధానంగా లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత ఆ వ్యవహారంలో నిందితులుగా భావిస్తున్న వారు మాత్రమే బయటకు వచ్చి ప్రభుత్వం తమను వేధిస్తుందని మాట్లాడేవారు. వారికి మద్దతుగా పార్టీలో ఒకరిద్దరు నేతలు మాత్రమే మాట్లాడటం, మిగిలిన నేతలు సైలెంటుగా ఉండటంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు వంటివారు పెద్దగా మాట్లాడకపోవడం ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఈ విషయంలో పార్టీ కోఆర్డినేటర్ సజ్జల సందర్భం వచ్చిన ప్రతిసారి బయటకు వచ్చి తన నిరసన గళం వినిపిస్తున్నా, ఆయనకు మద్దతుగా ఇతర సీనియర్లు మాట్లాడకపోవడం వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని అంటున్నారు. లిక్కర్ స్కాంపై దూకుడు చూపిస్తున్న ప్రభుత్వం.. నిందితుల తరుపున పెద్దగా వాయిస్ వినిపించకపోవడంతో తన జోరు మరింత పెంచుతోందని అంటున్నారు. ఇక నేడో రేపో బాస్ వరకు వచ్చినా పార్టీ ఇదే పరిస్థితి ఉంటుందా? అన్న ఆలోచన వైసీపీ శ్రేణులను ఉలికిపాటుకు గురిచేస్తోందని అంటున్నారు.