చికెన్ దుకాణాలకు లైసెన్స్: మంచా.. చెడా.. ?
ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకాల వివరాలు.. వంటి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయనున్నారు.;
రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని విధంగా ప్రభుత్వం చికెట్ విక్రయించే షాపులకు లైసెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ప్రజలకు నాణ్యమైన చికెన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా చెబుతోంది. పౌల్ట్రీ నుంచి దుకాణం వరకు కోళ్ల సరఫరాపై పర్యవేక్షణతోపాటు.. చికెన్ విక్రయించే దుకాణాలను లైసెన్సు పరిధిలోకి తీసుకురావడం ద్వారా.. ప్రజలకు మేలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం చేస్తోంది. అయితే.. ఇది సర్కారుపై వ్యతిరేకత పెంచుతుందన్న వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వ వాదన చూస్తే.. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించుకున్నామని చెబుతోంది. దీనిని కీలక నిర్ణయంగా కూడా చెబుతోంది. ఈ కొత్త నిబంధనతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఈ నూతన విధానం ద్వారా కోళ్ల సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ప్రతి చోటా పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు.
ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకాల వివరాలు.. వంటి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయనున్నారు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకా కుండా, ఆరోగ్యానికి హాని కలిగించే స్టెరాయిడ్లు వాడి పెంచిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడం పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇంత వరకు బాగానే ఉంది.
కానీ.. వ్యాపార వర్గాల కోణంలో చూస్తే.. చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను పోషిం చేవారు చాలా మంది ఉన్నారు. వీరంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. లైసెన్సు పరిధిలోకి తీసుకురావడం ద్వారా.. తమ వ్యాపారాలపై నియంత్రణ ఉంటుందని.. తమను ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి తీసుకు వస్తారని కూడా చెబుతున్నారు. అంతేకాదు.. లైసెన్సుల పేరుతో తమ నుంచి సొమ్ము వసూలు చేస్తే.. అది అంతిమంగా ధరలపైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలకు.. లైసెన్సులు ఉన్నాయి. కానీ, చిరు వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం సరికాదన్నది మెజారిటీ వ్యాపారులు చెబుతున్న మాట. ఈ విషయంలో సర్కారు ఆలోచించాలని కోరుతున్నారు. దీనివెనుక రాజకీయం లేకపోయినా.. గతంలో వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించినట్టుగానే ఉంటుందని కొందరు చెబుతున్నారు.