ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ అలారం : అప్పుల వడ్డీల భారమే భరించలేనంతగా..!

ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది. ఆదాయం కన్నా అప్పుల భారమే ఎక్కువగా పీడిస్తోంది. కాగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక రాష్ట్ర ఖజానా ఎంత ప్రమాదకరంగా మారిందో తేటతెల్లం చేసిందని అంటున్నారు.

Update: 2026-06-19 16:30 GMT

ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది. ఆదాయం కన్నా అప్పుల భారమే ఎక్కువగా పీడిస్తోంది. కాగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక రాష్ట్ర ఖజానా ఎంత ప్రమాదకరంగా మారిందో తేటతెల్లం చేసిందని అంటున్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కంటే చేస్తున్న అప్పులే ఎక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రోజువారి కార్యకలాపాలకు కూడా ఇబ్బంది పడాల్సివస్తుందన్న కాగ్ హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆదాయానికి మించిన అప్పులు

కాగ్ నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ దారుణంగా ఉందని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెల వరకు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ. 19,414 కోట్లుగా నమోదైతే, అదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ. 20,663 కోట్లుగా ఉంది. అంటే, రాష్ట్రానికి వస్తున్న సొంత రాబడి కంటే, చేస్తున్న అప్పులే అధికంగా ఉన్నాయని అర్థం చేసుకోవాల్సివుందని అంటున్నారు. నిరంతరం రుణాలు తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వడ్డీలకే భారీగా నిధులు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా నిలిచే మరో కీలక అంశం 'వడ్డీ చెల్లింపులు'. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం పాత అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఖర్చవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిరుపేదలకు అందించే పింఛన్ల వంటి సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న నిధుల కంటే, అప్పుల వడ్డీల చెల్లింపులకే ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నారని అంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉత్పాదకత లేని అప్పుల వలయంలో చిక్కుకున్నాయని స్పష్టం చేస్తోందని చెబుతున్నారు.

జీతభత్యాల భారం

రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 32% నుండి 42% వరకు కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే వెచ్చించాల్సి వస్తోంది. భారీ జీతభత్యాల భారం, దానికి తోడు వడ్డీ చెల్లింపులు కలిసి బడ్జెట్‌లో దాదాపు 60-70% మేర నిధులను ఖాళీ చేస్తున్నాయి. దీనివల్ల సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంలోని మొదటి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా కాగ్ గుర్తించడం ఆందోళనకరమైన పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు.

2024-25లో అప్పుల మోత

కేవలం మే నెల వరకు ఉన్న గణాంకాలే కాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేబదుళ్ల రూపంలో రూ. 1,72,532 కోట్లు సేకరించింది. ఇలా అడ్డగోలుగా అప్పులు చేయడం వల్ల, భవిష్యత్తు తరాలపై భారీ ఆర్థిక భారం పడటమే కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పులను నియంత్రించడం, వడ్డీల భారాన్ని తగ్గించుకోవడం, ఆదాయ వనరులను పెంచుకోవడం అనే మూడు అంశాల మీద ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News