గోవానే తెచ్చేద్దాం.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలో పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా బీచ్ టూరిజంను ప్రోత్సహించాలనే భావనతో గోవా తరహాలో బీచ్ ల్లో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2026-06-05 08:01 GMT

ఏపీలో పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా బీచ్ టూరిజంను ప్రోత్సహించాలనే భావనతో గోవా తరహాలో బీచ్ ల్లో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సముద్ర తీరంలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. ప్రస్తుతం గోవా, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈ తరహా విధానంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

కేబినెట్ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్ ల్లో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా చోట్ల వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి చాలా మంది పర్యాటకులు గోవా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులు స్థానికంగానే ఖర్చు చేస్తే రాష్ట్రానికి ఆదాయంతోపాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తుంది.

ఈ నిర్ణయంపై టూరిజం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పర్యాటక అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా మద్యపాన సేవనాన్ని ప్రభుత్వం ప్రోత్సహించమేంటి? అంటూ విపక్షం విమర్శలు గుప్పిస్తోంది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వైసీపీ అధికారిక మీడియా ఆరోపిస్తోంది. మద్యం సేవించి పర్యాటకులు సముద్రంలోకి వెళితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అయితే, ప్రభుత్వం మాత్రం సముద్ర తీర పర్యాటకానికి ఎక్కువ అవకాశాలు ఉన్నందున బీచ్ సాక్స్ ఏర్పాటుకే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు గత ప్రభుత్వంలోనే ఈ దిశగా ప్రతిపాదనలు చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. ఇక 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భీమిలి, విశాఖ, మచిలీపట్నం, సూర్యలంక వంటిచోట్ల బీచ్ ఫెస్టివల్స్ పెద్ద ఎత్తున నిర్వహించింది. తాజాగా బీచ్ సాక్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో శాశ్వతంగా పర్యాటకాభివృద్ధికి అవకాశాలు ఏర్పాటవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News