ఏపీలో జనసేన బీజేపీ ఆశలు

ఈ రెండు పార్టీలు సీట్లు పెరగనున్న చోట్ల ఇప్పటి నుంచే తమ పార్టీ విస్తరణ కార్యక్రమాలలో ఉన్నాయి.;

Update: 2026-01-24 03:30 GMT

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి 175 అసెంబ్లీ సీట్లు కాస్తా 225 దాకా పెరుగుతాయని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర పెద్దలు సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. జన గణన పూర్తి అయితే ఎటూ లోక్ సభ సీట్లను పునర్ విభజన చేస్తారు కాబట్టి పనిలో పనిగా విభజన చట్టంలో పేర్కొన్న మేరకు అసెంబ్లీ సీట్లను కూడా పెంచుతారని అంటున్నారు. అలా చేసిన తరువాతనే 2029 ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఏపీలో చూస్తే కనిష్టంగా 50 గరిష్టంగా 65 దాకా అని లెక్క వేసుకుంటున్నారు.

మిత్రుల ఆశలు :

ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో మిత్ర పక్షాలుగా జనసేన బీజేపీ ఉన్నాయి. 175 సీట్లు ఉన్న చోటనే 21 సీట్లు జనసేన 10 సీట్లు బీజేపీ తీసుకున్నాయి. ఇది 2024 నాటి పొత్తులోని విషయం. అయితే అప్పటికీ జనసేన తన సీట్లను చాలా వరకూ తగ్గించుకుంది. బీజేపీ కూడా మరి కొన్ని కావాలని అడిగి కూడా వెనక్కి తగ్గింది. అయితే 2029లో మాత్రం ఉన్న సీట్ల కంటే ఎక్కువగా తీసుకోవాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. జనసేన 40 సీట్ల దాకా బీజేపీ 20 సీట్ల దాకా పొత్తు పేరుతో డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటి నుంచే సిద్ధం :

ఈ రెండు పార్టీలు సీట్లు పెరగనున్న చోట్ల ఇప్పటి నుంచే తమ పార్టీ విస్తరణ కార్యక్రమాలలో ఉన్నాయి. జనసేన అయితే క్యాడర్ కి ఈ మేరకు పార్టీని పటిష్టం చేసుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు బీజేపీ నుంచి జనసేనా నుంచి గతంలో పోటీ చేయాలని భావించి అవకాశాలు దక్కని వారు ఈసారి ఎన్నికల్లో రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు

తమ్ముళ్లలో సందడి :

ఇక 2024 ఎన్నికల్లో మిత్ర పక్షాల కోసం తమ సీట్లను త్యాగం చేసి త్యాగరాజులుగా మారిన టీడీపీ తమ్ముళ్ళు కూడా పెరగనున్న సీట్ల మీద ఆశల కర్చీఫ్ వేసేసారు అని అంటున్నారు. నిజానికి చూస్తే కూటమిలో టీడీపీ పెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీలో ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కనీసంగా ముగ్గురు నుంచి నలుగురు ఉంటారు. వీరికి ఎంత సర్దుబాటు చేసినా మొత్తం సీట్లు టీడీపీకి సరిపోవు అన్నది ఒక అంచనా ఉంది. కానీ మిత్రులకు ప్రయారిటీ ఇవ్వడం కూడా కూటమి పెద్దన్నగా టీడీపీ చూసుకోవాలి కాబట్టి ఆ పార్టీ బాధ్యతగానే వ్యవహరిస్తుంది అని అంటున్నారు.

ఇక్కడ పేచీ :

ఇక పెరగనున్న సీట్లతోనే పేచీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకసారి ఆగిన వారు 2029లో మాత్రం ఎక్కడా తగ్గేది ఉండదని అంటున్నారు. జనసేన బీజేపీ కలిపి అరవై సీట్లు కోరుకుంటే మాత్రం టీడీపీకి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అయితే అలా కాకుండా ఆయా పార్టీలు ఎంతో కొంత తగ్గి 2024 లో మాదిరిగా సహకరిస్తేనే కూటమిలో చాలా వరకూ ఆశావహుల కోరికలు తీరుతాయని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారివిగా ఉంటాయి. అలాగే ఇదే చాన్స్ అన్న ముఖ్య సూత్రం కూడా బలంగా పనిచేస్తూ ఉంటుంది దాంతో చూస్తే కనుక ఈసారి మిత్రులు గట్టిగానే పట్టు బిగిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు లాంటి చాణక్యుడు కూటమి పెద్దగా ఉండడంతో కచ్చితంగా సక్సెస్ ఫుల్ గానే అందరినీ కలుపుకుంటూ పోతారని దాంతో మరో భారీ విజయానికి ఈ పెరిగిన సీట్లే కారణం అవుతాయని విశ్లేషణలూ ఉన్నాయి. చూడాలి మరి ఈ ప్రచారాలలో నిజమెంత ఉందో. ఎలా ముందు ముందు జరుగుతుందో.

Tags:    

Similar News