ఏపీలో 'ఇంటింటికీ' రాజకీయమే!
వైసీపీ విషయానికి వస్తే.. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో జగన్ కూడా .. జూలై 1 నుంచి ఐదు వారాల పాటు.. జనం దగ్గరకు నాయకులను పంపించాలని తాజాగా నిర్దేశించారు.;
ఏపీలో జూలై 1 నుంచి రాజకీయాలు మరింత సెగ పుట్టించనున్నాయా? ప్రజలకు మరింతగా రాజకీయాలు ఇబ్బంది పెట్టను న్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా రెండు కీలక కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఇరు పక్షాలు కూడా.. ఇంటింటికీ రాజకీయం చేరువ చేయనున్నాయి. ఎవరి వాదనను వారు వినిపించనున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీది ఒక వాదనగా ఉండగా.. ప్రతిపక్ష వైసీపీది మరో వాదనగా ఉంది. దీంతో జూలై 1నుంచి రాష్ట్ర రాజకీయాలు హోరెత్తనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ కార్యక్రమం విషయానికి వస్తే.. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ కార్యకర్తలు, నాయ కులను పంపించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రబుత్వం ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలు, ఇచ్చిన సంక్షేమం, చేసిన అబివృద్ధిని నాయకులు గడపగడపకు వెళ్లి వివరించాలని నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే కాకుండా.. వార్డు స్థాయి నాయకులకు కూడా బాధ్యత అప్పగించారు. దీనిని ఆధారంగా చేసుకుని ప్రజల సంతృప్తి మేరకు .. కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సమస్యను నోట్ చేసుకోవాలని సూచించారు.
వైసీపీ విషయానికి వస్తే.. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో జగన్ కూడా .. జూలై 1 నుంచి ఐదు వారాల పాటు.. జనం దగ్గరకు నాయకులను పంపించాలని తాజాగా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించి.. ఏయే పథకాలను ఎన్నెన్ని అమలు చేయాలి? ఎన్ని అమలు చేశారు? అనే వివరాలు తెలియజేస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఎంత మేరకు నిధులు అందాలి? ఎన్ని అందాయనే వివరాలను కూడా పేర్కొంటారు. తద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను విస్మరించిందన్న వాదాన్ని బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఏం జరుగుతుంది?
ఈ రెండు పార్టీలదూకుడుతో ప్రజల ఇళ్లకు నాయకులు అయితే వస్తారు. కానీ, వారి సమస్యలు ఏమేరకు పట్టించుకుంటారన్నది ప్రశ్న. ఎందుకంటే .. ఈ రెండు కూడా రాజకీయ పరమైన అంశాలే. ఎవరి వాదన వారిది. ఎవరి రాజకీయం వారిది. ఈ క్రమంలో నిజంగానే సమస్యలు ఉన్న ప్రజలకు వేదిక లభించే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాదు.. ఏడాదిలోనే అన్నీజరిగిపోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి లేదు. ఇల్లు అలకగానే పెళ్లి.. అన్నది జగన్ వాదన. కానీ, ఇది సాధ్యం కాదన్నది ఆయన పార్టీకి చెందిన వారే చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ వాదన వీగిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి.