14 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈ భారీ మార్పులకు కారణమేంటి?
ఏపీలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టారు.;
ఏపీలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 14 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను మార్చారు. మొత్తం 26 జిల్లాల్లోనూ మార్పులు చేస్తారని అనుకున్నా, కొన్ని జిల్లాలపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నందున ప్రస్తుతానికి సగం జిల్లాల్లో మాత్రమే కలెక్టర్లు, ఎస్పీలను మార్చారు. మిగిలిన జిల్లాలకు త్వరలోనే బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో మార్పులకు కారణమేంటి? అన్న చర్చ జరుగుతోంది.
మరో మూడు నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నందన జిల్లాల్లో తన టీం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే పూర్తిగా తన వారిగా ముద్రపడిన వారిని కలెక్టర్లుగా పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నవారిలో కొందరు రాజధానిలో చంద్రబాబు టీంలో చురుగ్గా ఉన్నవారు కూడా ఉండటం విశేషం. తనకు నమ్మిన బంటులాంటి అధికారులను కలెక్టర్లుగా పంపి.. తన ఆలోచనలకు తగ్గట్టు పాలన కొనసాగేలా చూడటమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాలను చూసుకుని పక్కాగా ఎంపిక చేశారని అంటున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు హిమాన్షు శుక్లా, క్రుతికా శుక్లా, రాజాబాబులను కలెక్లర్లుగా పంపడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఐ ఆండ్ పీఆర్ కమిషనర్ గా సమర్థవంతంగా పనిచేస్తున్న హిమాన్షును ఏరికోరి నెల్లూరు కలెక్టరుగా పంపారని అంటున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చూస్తున్న క్రుతికా శుక్లాను పల్లాడు జిల్లా కలెక్టర్ గా ఎంపిక చేశారు. హిమాన్షు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా పనిచేయగా, క్రుతికా శుక్లా మంత్రి లోకేశ్ పరిధిలోని ఇంటర్ విద్య బాధ్యతలు చూశారు. ఇద్దరు సీఎం, ఆయన తనయుడు చూస్తున్న శాఖలను చక్కగా నిర్వహించడంతో కలెక్టరుగా మళ్లీ చాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఈ ఇద్దరి నియామకం ప్రభుత్వ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని ఐఏఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని కోరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడిన వైసీపీని మరింత దెబ్బతీసేలా స్థానిక ఎన్నికల్లో హవా చూపాలని భావిస్తోందని అంటున్నారు. తాము కోరుకున్న విజయం దక్కాలంటే జిల్లాల్లో తమకు అనుగుణంగా పనిచేసే కలెక్టర్లు ఉండాలని ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో అనుకూలంగా పనిచేస్తారని నమ్మకం ఉన్న వారికి కలెక్టర్లు, ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.
భారీ స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలను మార్చినందను స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ వెంటనే పంచాయతీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆయా స్థానాల్లో మెజార్టీ వైసీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్లినా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో ఇది రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెట్టే పరిస్థితి ఉన్నందున సమర్థులైన వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా పైచేయి సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అందుకే భారీ ఎత్తున మార్పులు చేసినట్లు చెబుతున్నారు.