చైనాతో యుద్ధం.. అమ్మ బంగారం విరాళం.. ఆనంద్ మహీంద్ర బాల్య జ్ఞాపకం
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ప్రేమనో చెప్పాల్సిన పనిలేదు. ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు ఆభరణాలను ధరించి తమ హోదా చూపించుకోవాలని భావిస్తుంటారు.;
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.. వ్యక్తులు ఎవరైనా పోస్ట్ చేసే మంచి అంశాల పట్ల సత్వరమే స్పందిస్తుంటారు..! సాధ్యమైతే సాయం చేస్తుంటారు.. తాజాగా బంగారం విషయమై ఓ యువకుడు పెట్టిన పోస్ట్ ఆనంద్ మహీంద్రా వరకు వెళ్లింది. రోజురోజుకు రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధర గురించి మీడియాలో వార్తలు రాని రోజు ఉండడం లేదు. ఒకప్పుడు కేవలం అడపాదడపానే తప్ప చర్చకు రాని బంగారం ధర ఇప్పుడు నిత్యం వార్తల్లో ఉంటోంది. ఇక 35 ఏళ్ల కిందట బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి భారత దేశం ఆర్థిక సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా 880 మెట్రిక్ టన్నులు పైగా నిల్వలు ఉన్న స్థాయికి చేరింది భారత రిజర్వ్ బ్యాంకు. నెల కిందటి ధరతో చూస్తే దీని విలువ రూ.8.36 లక్షల కోట్లు. ఇప్పుడు దాదాపు రూ.9 లక్షల కోట్లు అనుకోవచ్చేమో..??
మన మహిళలు బంగారు కొండలు..
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ప్రేమనో చెప్పాల్సిన పనిలేదు. ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు ఆభరణాలను ధరించి తమ హోదా చూపించుకోవాలని భావిస్తుంటారు. ఇలా భారతీయ మహిళల వద్దనే కాదు.. పురుషుల వద్ద కూడా పోగుపడిన బంగారం 25 వేల టన్నులు ఉంటుందని అంచనా. ఇది అమెరికా, జర్మనీ దేశాల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనికి ఇంప్రెసింగ్ స్టాట్స్ అంటూ ఆనంద్ మహింద్రా స్పందించారు. అంతేకాదు.. తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను కూడా పంచుకున్నారు.
చైనా యుద్ధం.. భారతీయుల త్యాగం
టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో 1962లో యుద్ధానికి దిగింది చైనా. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రవచించిన హిందీ -చీనీ భాయీభాయీ నినాదానికి తూట్లు పొడిచింది. చైనా బలం ముందు మన శక్తి సరిపోలేదు. దీనికంటే.. ఎంతో నమ్మకం ఉంచిన చైనా ఈ విధంగా చేయడాన్ని నెహ్రూ జీర్ణించుకోలేకపోయారు. మనస్తాపంతో ప్రాణాలు విడిచారు. ఇక చైనా యుద్ధం సమయానికి భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 15 ఏళ్లు మాత్రమే. ఆర్థికంగా మన దేశం చాలా బలహీనంగా ఉంది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. దేశ రక్షణ కోసం బంగారు, ఆభరణాలు విరాళం ఇవ్వాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించి పంజాబ్ ప్రజలే 252 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారనేది చరిత్ర చెబుతున్న సత్యం.
అమ్మ మెడలోని బంగారం విరాళం..
చైనా యుద్ధం సమయంలో ఏడేళ్ల పిల్లాడిగా ఉన్నారు ఆనంద్ మహీంద్రా. ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన విరాళం ఇప్పటికీ గుర్తుందని పోస్ట్ లో రాసుకొచ్చారు. విరాళాలు కోరుతూ ముంబై వీధుల్లోకి వాహనాలు రాగా.. తన తల్లితో కలిసి చూశానని పేర్కొన్నారు. బంగారు గాజులు, మెడలోని హారాలను వస్త్రంలో చుట్టి ఆమె విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఈ సీన్ తన మనసులో అలా నాటుకుపోయిందన్నారు. దేశ ప్రజల ఐక్యత, నమ్మకాన్ని, స్వచ్ఛందంగా ఉదారతను చాటే సందర్భం ఇంకోటి ఉంటుందా? అని ఆనంద్ మహీంద్రా అన్నారు.