అమిత్ షా వ్యాఖ్యలతో రాజుకుంటున్న పొలిటికల్ హీట్

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజా వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి గానీ జైలులో ఉండి అధికారాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.;

Update: 2025-08-25 09:30 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజా వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి గానీ జైలులో ఉండి అధికారాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు ఏదైనా కేసులో అరెస్టయ్యే పరిస్థితి వస్తే, 30 రోజులలోపు బెయిల్‌ దక్కకపోతే పదవి నుంచి తప్పుకోవడం తప్పనిసరి అవుతుందని, ఇదే 130వ రాజ్యాంగ సవరణలో ప్రధాన ప్రతిపాదనగా ఉందని ఆయన మరోసారి వివరించారు.

అలాంటి వారిని సమర్థించం..

విపక్షాల విమర్శలపై అమిత్‌ షా మరింత ఘాటుగా స్పందించారు. “జైలులో నుంచే ప్రభుత్వాలను నడిపించాలనుకునే ఆలోచనను తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ అలా అయితే ఉన్నతాధికారులు జైలు గోడల వెనుక నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి వస్తుందని. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని షా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవికీ ఈ నిబంధన వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీ అంగీకరించారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చవద్దు..

ఈ సవరణను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా విపక్షాలు అడ్డుకోవడం సరైంది కాదని షా అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణపై చర్చించడానికి, అభ్యంతరాలు చెప్పడానికి అందరికీ అవకాశం ఉంటుందని, కానీ ఆవేశపూర్వక ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్య విధానాన్ని బలహీనపరుస్తుందని స్పష్టం చేశారు.

రాహుల్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం

విపక్షాలు నైతికత పేరుతో చేస్తున్న ఆరోపణలను కూడా అమిత్‌ షా ఖండించారు. 2013లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన చర్యలను గుర్తు చేశారు. ఆ సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను రక్షించేందుకు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఆయన చించిపారేయడమే నిజమైన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. “ఆ రోజు నిజంగా నైతికతతో వ్యవహరించి ఉంటే, ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు’’ అని షా వ్యాఖ్యానించారు.

మొత్తం మీద, 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు, రాబోయే రోజుల్లో రాజకీయ వేడి మరింత పెంచే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.

Tags:    

Similar News