అంబటి ట్రాప్ లో టీడీపీ.. ఎలాగో తెలుసా?

ఉప ముఖ్యమంత్రి పవన్ సినిమాలు హరిహరవీరమల్లు, ఓజీ విడుదలకు ముందు అంబటి తన యూట్యూబ్ చానల్ లో ప్రత్యేకంగా వీడియోలు చేశారు.;

Update: 2025-11-10 20:30 GMT

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ అన్నప్రసాదంపై అంబటి చేసిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. కూటమి పాలనలో టీటీడీ పనితీరు మెరుగైందని తమ రాజకీయ ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటున్నారని సంబరపడుతుంది. అయితే ఇది తాత్కాలిక ఆనందమేనని పరిశీలకులు సందేహిస్తున్నారు. అంబటి రాజకీయ చతురతను ఎరిగిన వారు ఆయన లోతైన వ్యూహంతోనే ఈ వీడియో చేశారని అనుమానిస్తున్నారు.

వైసీపీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న అంబటి ఈ తరహా వీడియోలతో సొంత పార్టీకి ఇబ్బందని తెలియనంత అమాయకుడేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన ఈ వీడియో వల్ల పార్టీకి తాత్కాలికంగా నష్టం జరిగినా, భవిష్యత్తులో తాను పేల్చబోయే మాటల బాంబులు అంతకు మించి మేలు చేస్తాయని అంబటి ఆలోచనగా ఉందని అంటున్నారు. దీనికి గతంలో ఆయన చేసిన కొన్ని వీడియోలను ఉదాహరణగా చూపుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల విడుదల సందర్భంగా అంబటి వదిలిన వీడియోలు, సినిమా రిలీజ్ తర్వాత ఆయన చేసిన సమీక్షల వీడియోలను గుర్తు చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ సినిమాలు హరిహరవీరమల్లు, ఓజీ విడుదలకు ముందు అంబటి తన యూట్యూబ్ చానల్ లో ప్రత్యేకంగా వీడియోలు చేశారు. మంచి నటుడైన పవన్ సినిమాలు హిట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో అంబటికి ఏమైందని స్వపక్షంతోపాటు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. రాజకీయంగా పవన్ ను తిట్టిపోసే అంబటి ఆయన సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకోవడం ఏంటని తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే సినిమాలు విడుదలైన తర్వాత అంబటి సినీ విమర్శకుడి అవతారమెత్తి పవన్ సినిమాలపై ఇచ్చిన రివ్యూలు చూసి అంతా షాక్ తిన్నారు. ముందు పాజిటివ్ వీడియో చేసి అందరి దృష్టిని తనవైపు ఆకర్షించిన అంబటి.. తర్వాత అసలు సిసలు రాజకీయ నాయకుడిగా తన చాణక్యం ప్రదర్శించారని అంటున్నారు.

ఇప్పుడు కూడా టీటీడీ విషయంలో ఆయన చేసిన వీడియోపై ఇదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలో దేవుడి ప్రసాదం బాగుందని ఆయన కితాబునివ్వడం వెనుక ఇంకేదో వ్యూహం దాగుందని ఉందని సందేహిస్తున్నారు. తన నెక్ట్స్ వీడియోలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందా? అని డౌట్ పడుతున్నారు. ప్రస్తుతం టీటీడీపై అంబటి చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆయన యూట్యూబ్ చానల్ వ్యూవర్ షిప్ కూడా భారీగా పెరుగుతుందని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అంబటికే మేలు జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News