లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.. అందేకే వైసీపీ నేతల అరెస్టులని వివరణ

రౌడీలు, దొంగలను బెదిరించినట్లు తమను బెదిరిస్తే బెదిరిపోమని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామన్నారు.;

Update: 2025-06-22 13:20 GMT

మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల అరెస్టులపై మాట్లాడిన అంబటి.. లోకేశ్ తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెట్టారనేగా ఇంతమందిని జైలులో పెట్టిస్తున్నారని అంబటి మండిపడ్డారు. అరెస్టు అయిన నేతలు అంతా కక్ష పెట్టుకుంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోమని లోకేశ్ ను హెచ్చరించారు. అరెస్టులతో తాము మనోధైర్యం కోల్పోవడం లేదని, మనోధైర్యం ఉన్నవాళ్లే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నామని అంబటి తెలిపారు.

రౌడీలు, దొంగలను బెదిరించినట్లు తమను బెదిరిస్తే బెదిరిపోమని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామన్నారు. లోకేశ్ చెబితే తమపై కేసులు పెట్టడమేంటని అంబటి ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అప్పుడే ఏడాది పూర్తయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లోకేశ్ ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారని, ఖాకీ చొక్కాల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకోవద్దని హెచ్చరించారు. రాజ్యంగ బద్ధంగా పరిపాలించాలని సూచించారు.

వైసీపీ నేతలపై కక్ష పెంచుకుని నెలల పాటు తమను జైలులో ఉంచుతున్నారని అంటున్నారు. ఆలోచించుకో లోకేశ్.. అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మనోధైర్యంతో ఉన్నవారే లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. తమపై కేసులు పెట్టే క్రమంలో హింసించే క్రమంలో దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తమను ఎన్నాళ్లు జైలులో పెడతారో చూస్తామని తెగేసి చెప్పారు.

రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న నాగ మల్లేశ్వరరావు బెట్టింగ్ ఆడారని తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. అదేవిధంగా తెనాలిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ‘రప్పా.. రప్పా..నరుకుతాం’ అన్న పోస్టర్ పైనా అంబటి స్పందించారు. సినిమా డైలాగ్ చెబితే తప్పేముందని జగన్ వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తున్నారని అన్నారు. తెలుగు దేశంలో సభ్యత్వం ఉన్నవాడే రప్ప.. రప్ప నరికేస్తామని పోస్టర్ వేశాడన్నారు. మీ పాలనపై మీ కార్యకర్తలే విసిగిపోయారని అంబటి వ్యాఖ్యానించారు. ‘రప్పా.. రప్పా’ పోస్టర్ పై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News