జనసేనపై అంబటి సానుభూతి.. కూటమిలో చిచ్చు పెట్టే స్కెచ్?

ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వ్యూహాలు ఆసక్తిరేపుతున్నాయి.

Update: 2026-10-22 12:30 GMT

ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వ్యూహాలు ఆసక్తిరేపుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూటమిలోని మూడు పార్టీల మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతుండగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేలా వైసీపీ పావులు కదుపుతోందని చెబుతున్నారు. ఇందుకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జనసేన కావాలి, ఎన్నికలొస్తే తమ వాళ్లు కావాలనే రీతిలో టీడీపీ నేతల ప్రవర్తన ఉందంటూ అంబటి చేసిన కామెంట్స్ జనసేన శ్రేళ్లలో ఆలోచన రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో జనసేనపై సానుభూతి చూపుతున్నట్లు కనిపించినా, కూటమిలో చిచ్చు పెట్టే రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు, కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల (టీడీపీ-జనసేన) కేడర్ మధ్య ఉండే స్థానిక విభేదాలను రెచ్చగొట్టేలా వైసీపీ పావులు కదుపుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. చిన్నపాటి అసంతృప్తులను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఈ విషయంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను వైసీపీ వాడుకుంటోందని విశ్లేషిస్తున్నారు. "టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన నేతలను భుజాల మీద ఎక్కించుకుంటారా? అధికారం పంచుకునేటప్పుడు, లేదా స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో జనసేనను చిన్నచూపు చూస్తున్నారు" అనేలా అంబటి మాట్లాడటం వెనుక జనసేన క్యాడర్‌లో అసంతృప్తిని రగిలించాలనే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, కూటమిలో జనసేన ప్రాధాన్యతను ప్రశ్నించే ధోరణిలో అంబటి మాట్లాడటం చూస్తే వైసీపీ ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ఇలాంటి ఎత్తుగడ ఎంచుకున్నారని అంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు తగిన గౌరవం దక్కడం లేదనే భావనను ఆ పార్టీ కార్యకర్తల్లో బలవంతంగా నాటాలనేది వైసీపీ వ్యూహంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ, క్షేత్రస్థాయిలో కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తు సరిగ్గా కుదరని చోట్ల లేదా సీట్ల సర్దుబాటులో అసంతృప్తి ఉన్న చోట్ల మరింత అగ్గిరాజేసి రాజకీయంగా లాభపడాలని వైసీపీ ఆలోచనగా ఉందని అంటున్నారు. జనసేన కేడర్ నైతికంగా కుంగిపోయేలా లేదా టీడీపీ తీరుపై తిరగబడేలా మానసిక వాతావరణం సృష్టించడమే వైసీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం జరుగుతోందనే నరేటివ్‌ను జనసైనికులలోకి చొప్పించడం ద్వారా, కూటమిలో అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టాలనేది ప్రతిపక్షం ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు కేవలం జనసేనపై ప్రేమతో చేసినవి కావని, స్పష్టమైన పొలిటికల్ స్ట్రాటజీలో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కూటమిలోని పార్టీలు ఈ వ్యూహాన్ని గమనించకపోతే, చిన్న చిన్న అంశాలు కూడా పెద్ద కలహాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News