అమెజాన్‌లో భారీ ఉద్యోగ కోతలు: ఇంజినీర్లకే అతి పెద్ద దెబ్బ!

ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గిస్తూ టెక్‌ రంగానికి షాక్ థెరపీ ఇచ్చింది.;

Update: 2025-11-22 11:34 GMT

ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గిస్తూ టెక్‌ రంగానికి షాక్ థెరపీ ఇచ్చింది. గత నెలలో ప్రకటించిన 14,000 పైచిలుకు కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపుల్లో ఇంజినీరింగ్ విభాగమే అత్యధికంగా నష్టపోయినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది.

40% కోతలు ఇంజినీరింగ్ విభాగంలోనే

అమెరికాలోని ముఖ్య రాష్ట్రాలైన న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లలో అమెజాన్ సమర్పించిన WARN (వర్కర్ అడ్జస్ట్ మెంట్ మరియు రిట్రెయినింగ్ నోటిఫికేషన్) నోటీసుల ప్రకారం కీలకమైన వివరాలు తెలిశాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో నమోదైన మొత్తం 4,700 తొలగింపుల్లో దాదాపు 40 శాతం, అంటే ఏకంగా 1,800 మంది ఇంజినీర్లు ఉన్నారు.

ఇవి కేవలం కొన్ని రాష్ట్రాల డేటా మాత్రమే. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోని నోటీసులు వెల్లడైతే, మొత్తం ఇంజినీరింగ్ కోతల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఇంజినీర్లపైనే ఎందుకు ఇంత ప్రభావం?

అమెజాన్‌ సంస్థ AWS, డివైసెస్, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి దాదాపు అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది. అయినప్పటికీ ఇంజినీర్లే అధిక సంఖ్యలో ప్రభావితం కావడానికి ప్రధాన కారణాలున్నాయి. టీమ్‌ల రీ-ఆర్గనైజేషన్ (పునర్వ్యవస్థీకరణ), మధ్య వరుస నిర్వహణ (మేనేజ్‌మెంట్) లేయర్ల తొలగింపు. సంస్థలు వేగంగా ఏఐ వైపు మళ్లుతున్నాయి. తక్కువ మానవ వనరులతో ఎక్కువ పనితీరును అందించే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది.

ఏఐ ప్రభావం – ఉద్యోగ మార్కెట్ రూపు మారుతోంది

అమెజాన్‌ సీఈఓ ఆండీ జెస్సీ పలుమార్లు “ఇది AI శకం” అని స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో కోడింగ్, డెవలప్‌మెంట్ పనుల కోసం AI టూల్స్, ఆటోమేషన్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఓపెన్ ఏఐ, కర్ సర్, కాగ్నిషన్, వంటి సంస్థల "వైబ్ కోడింగ్ " ప్లాట్‌ఫామ్స్ టెక్‌ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి.

అమెజాన్ కూడా తన సొంత ఏఐ కోడింగ్ టూల్ ‘కిరో’ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీని కారణంగా సాంప్రదాయిక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలపై ఒత్తిడి అధికమైంది.

టెక్ చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు

2022లో మొదలైన టెక్ లేఆఫ్ తరంగం ఇప్పటికీ కొనసాగుతోంది. కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ మానవ వనరులను పునర్నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది 230కిపైగా టెక్ కంపెనీలు మొత్తం 1.13 లక్షలకుపైగా ఉద్యోగాలను తగ్గించాయి. అమెజాన్‌ చేపట్టిన ఈ కోతలే ఈ జాబితాలో అత్యంత పెద్దవిగా ఉన్నాయి.

CNBC నివేదికల ప్రకారం, అమెజాన్‌ రాబోయే జనవరిలో మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళనను పెంచుతోంది.

ఏఐ విప్లవం వేగం పుంజుకుంటున్న కొద్దీ టెక్ ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కోడింగ్, డెవలప్‌మెంట్ ఉద్యోగాల కోసం పోటీ మరింత కఠినమవుతోంది. అమెజాన్ వంటి దిగ్గజాలు ఏఐ ఆధారిత వ్యవస్థల వైపు దూసుకుపోతుండడంతో, సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల భవిష్యత్తు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News