చంద్రబాబు కలల ప్రాజెక్టు.. జాగ్రత్త: ప్రపంచ బ్యాంకు
ఏపీ రాజధాని అమరావతి పనుల కోసం.. రుణాలు మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు తాజాగా శుక్రవారం సాయంత్రం అమరావతిలో పర్యటించారు.;
ఏపీ రాజధాని అమరావతి పనుల కోసం.. రుణాలు మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు తాజాగా శుక్రవారం సాయంత్రం అమరావతిలో పర్యటించారు. ప్రస్తుతం ప్రారంభమైన పనులను వారు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగించాలని.. ఎక్కడా తేడా రాకుండా పనిచేయాలని రాజధానిపనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు సూచించారు. అనంతరం.. అమరావతిలోనే కాంట్రాక్టర్లు, సీఆర్ డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అధికారులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు కాంట్రాక్టర్లు, సీఆర్ డీఏ అధికారులకు పలు సూచన లు చేశారు. ``సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధానిని భావిస్తున్నారు. దీనిపై మేం అచ్చరువొందాం.(ఉయ్ ఆర్ సర్ ప్రైజ్డ్ అబౌట్ హిజ్ కమిట్ మెంట్ టువార్డ్స్ క్యాపిటల్). దీనిని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పనులు సజావుగా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టాలి. ఎక్కడా తేడా రావొద్దు. జాగ్రత్త`` అని సూచించారు. ఇదేసమయంలో పనులను సకాలంలో టౌంబౌండ్ ప్రకారం పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. తాము ప్రతి మూడుమాసాలకు ఒకసారి వస్తామని, పనుల పురోగతిని అంచనా వేస్తామని చెప్పారు.
దీనిని బట్టే నిధుల విడుదల ఉంటుందని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఎక్కడా బాల కార్మ కులను వినియోగించరాదన్నారు. అదేవిధంగా కార్మికులకు ఇచ్చే వేతనాలు కూడా కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. విధుల్లో ఉండే కార్మికలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, వసతి, భోజన ఏర్పాట్లను కూడా జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.
కార్మికుల ఆరోగ్యం, వారికి భద్రత వంటి విషయాలపై ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా.. మరో రెండు రోజుల పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు ఇక్కడే పర్యటించ నున్నారు. పనుల పురోగతిని వారు అంచనావేసి.. రెండో విడత నిధులు విడుదల అయ్యేలా చేస్తారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు.. 3 వేల కోట్ల రూపాయలకు పైగా తొలి విడతలో విడుదల చేసిన విషయం తెలిసిందే.