అమరావతి రాజధాని చట్టబద్ధం చేసినా...డౌట్లు ఎన్నో ?
అయితే అంతటితో అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందా. వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మూడు రాజధానుల ప్రసక్తి ఉండకుండా ఉంటుందా అంటే దాని మీద అనేక సందేహాలు అయితే ఉన్నాయి.;
అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా భూములు ఇచ్చి తమ త్యాగాలను చాటుకుంటున్న వారి కోరిక సమంజసమైనదే. తమ భూములకు రాజధాని వస్తేనే విలువ ఉంటుందని భావి తరాలు సుఖపడతాయని వారు ఈ విధంగా వేలాది ఎకరాలను త్యాగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2015లో భూములు ఇచ్చినపుడు లేని బెంగలు అన్నీ ఇపుడు రైతులకు వస్తున్నాయి. దానికి కారణం 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానులు అంటూ కొత్త వాదనను తీసుకుని వచ్చింది. అయితే అనేక చిక్కుల మధ్యన అది అమలు చేయలేక పోయింది. ఇక 2024 లో ఓటమి తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో కొత్త డిమాండ్ వచ్చింది. అమరావతిని శాశ్వతంగా ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలన్నది ఆ డిమాండ్.
బిల్లు తయారు అవుతున్న వేళ :
ఇక రైతుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంతో పాటు ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తోంది. పెట్టుబడులు రావాలన్నా పారిశ్రామికవేత్తలకు ధైర్యం కలగాలి అన్నా అమరావతి అధికారిక రాజ ముద్రతో ఉండాలన్నది ప్రహ్బుత్వం భావనగా ఉంది. అందుకే పనిగట్టుకుని మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు ప్రత్యేకంగా అమరావతి రాజధానిని శాశ్వతం చేస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టమని కోరారు. ఆ మీదట రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అమరావతి ఏపీకి రాజధానిగా అధికారిక ముద్ర పడుతుంది.
అంతటితో అయిపోయిందా :
అయితే అంతటితో అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందా. వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మూడు రాజధానుల ప్రసక్తి ఉండకుండా ఉంటుందా అంటే దాని మీద అనేక సందేహాలు అయితే ఉన్నాయి. దానికి కారణం తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన అమరావతి మీద కుండబద్దలు కొట్టేశారు. ఒక విధంగా వైసీపీ విధానం తేటతెల్లం చేశారు. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం తగదని చెప్పారు. అది అనుకూలమైన ప్రాంతం కాదని అన్నారు. గుంటూరు విజయవాడల మధ్య రాజధాని నిర్మిస్తే బాగుండేది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా రాజ్యాంగంలో రాజధాని అన్నది ఏదీ స్పష్టంగా లేదని సీఎం ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని అని కూడా జగన్ అన్నారు. దాంతోనే ఇపుడు సరికొత్త డౌట్లు పుడుతున్నాయి.
రాజ్యాంగం ఏమి చెబుతోంది :
ఇక రాజధానుల విషయంలో రాజ్యాంగంలో ఏముంది అన్న ప్రశ్నలు కూడా ఇపుడు ఉదయిస్తున్నాయి. భారత రాజ్యాంగం రాష్ట్ర రాజధాని అనే పదాన్ని స్పష్టంగా నిర్వచించలేదు లేదా రాష్ట్ర రాజధానుల స్థానాన్ని పేర్కొనలేదు. సాంప్రదాయకంగా రాష్ట్ర శాసనసభలు తమ రాజధాని నగరాన్ని నిర్ణయించే లేదా మార్చే అధికారాన్ని వినియోగించుకుంటాయి, ఈ ఆచారాన్ని అంతర్గత పాలన యొక్క పొడిగింపుగా భావిస్తారు. రాష్ట్రాలు న్యాయ జోక్యం లేకుండా రాజధానులను మార్చినవి కూడా దేశంలో ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే గుజరాత్ తన రాజధానిని అహ్మదాబాద్ నుండి గాంధీనగర్‌కు మార్చింది. మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా బహుళ రాజధానులను కలిగి ఉన్నాయి. అవి వేసవి శీతాకాల రాజధానులుగా ఉన్నాయి. వైసీపీ హయాంలో చూస్తే మూడు రాజధానులు అని అన్నారు. దానికి కారణం ఈ విషయంపై స్పష్టమైన రాజ్యాంగ స్పష్టత లేకపోవడానిగానే చూడాలని నిపుణులు అంటారు.
వైసీపీ ఆలోచనలు ఏంటి :
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ పార్టీ రేపటి రోజున అధికారంలోకి వస్తే రాజధాని ఒకటికి బదులుగా మూడు అన్న తమ పాత విధానం అమలు చేస్తుందా అన్న చర్చ అయితే మొదలైంది. అలా చేయవచ్చా గెజిట్ నోటిఫికేషన్ అమరావతికి ఇచ్చినా కుదురుతుందా అంటే రాజ్యాంగంలో సరైన నిర్వచనం దీని మీద లేదని అంటున్నారు. చూడాలి మరి జగన్ అన్న దాని మీద అయితే ఇపుడు ఏపీలో అతి పెద్ద కలకలమే రేగే చాన్స్ ఉంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.