అమరావతిలో మంటలు.. కారణం తెలిసింది.. నిందితుడు ఎవరంటే..
ఈ నెల 11న వెలిగిపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎల్ అండ్ టీ కంపెనీ పైపులు కాలిపోయాయి. అదేవిధంగా 23న రాయపూడి వద్ద మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పైపులు దహనమయ్యాయి.;
రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రి దహనంపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. పైపులు తగలబడటానికి స్టాక్ పాయింట్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డే కారణమని పోలీసులు గుర్తించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్యూటీ విషయంలో సూపర్ వైజర్ వేధిస్తున్నాడనే ఆగ్రహంతో సెక్యూరిటీ గార్డు స్టాక్ పాయింటులో పైపులను తగలబెట్టాడని విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. 12 గంటలకన్నా అదనంగా పనిచేయిస్తుండటం, సెలవులు ఇవ్వకుండా వేధించడం వల్లే పైపులను తగలబెట్టినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాల సమాచారం.
రాజధాని అమరావతిలో 12 రోజుల వ్యవధిలో రెండు చోట్ల పైపుల స్టాక్ పాయింటులో పైపులు కాలిపోయాయి. ఈ ఘటనలను కుట్రగా అనుమానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. గుంటూరు ఏఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణను ప్రారంభించిన ఏఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సిట్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ స్టాక్ పాయింట్ లో సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది.
ఈ నెల 11న వెలిగిపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎల్ అండ్ టీ కంపెనీ పైపులు కాలిపోయాయి. అదేవిధంగా 23న రాయపూడి వద్ద మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పైపులు దహనమయ్యాయి. దీనిపై మేఘా ఇంజనీరింగ్ ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ ఘటనలను సీరియస్ గా తీసుకోవడంతో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటనను లోతుగా పరిశీలించిన పోలీసులు సెక్యూరిటీ గార్డుపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు అసలు విషయాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. డ్యూటీ విషయంలో సూపరవైజర్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజు నిందితుడు సాయంత్రం 6 గంటలకే డ్యూటీ దిగిపోవాల్సివుందని అంటున్నారు. కానీ, సూపర్ వైజర్ రాత్రి కూడా వేశాడని, అప్పటికీ విరేచనాలతో నీరసించిపోయిన నిందితుడు డ్యూటీ చేయలేనని చెప్పినా సూపర్ వైజర్ వినలేదని పోలీసులకు తెలిపాడని సమాచారం.
దీంతో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచుతారని, ఆ విధంగా అయినా తనకు విశ్రాంతి దొరుకుతుందనే ఆలోచనతో నిందితుడు పైపులు తగలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపాడని అంటున్నారు. అంతేకాకుండా ఘటన వల్ల సూపర్ వైజర్ పై చర్యలు తీసుకుంటారని ఆశించాడని అంటున్నారు. సమీపంలో ఉన్న వాహనాల నుంచి పెట్రోల్ తీసి పైపులను తగలబెట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు నిందితుడు చెప్పిన విషయాలను పూర్తిగా నమ్మడం లేదని అంటున్నారు. దీనివెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయంపై అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడికి ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.