అమరావతి శాశ్వత రాజధాని...ప్రస్తుతానికేనా ?
ఏమిటీ సందేహం. ఎందుకీ డౌట్లు అంటే అవన్నీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వారికి న్యాయ పరమైన సంపూర్ణ అవగాహన ఉన్న వారికి మాత్రమే అర్థం అవుతాయి.;
ఏమిటీ సందేహం. ఎందుకీ డౌట్లు అంటే అవన్నీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వారికి న్యాయ పరమైన సంపూర్ణ అవగాహన ఉన్న వారికి మాత్రమే అర్థం అవుతాయి. అసలు ఒక చట్టం ఎలా రూపొందిస్తారు, అది ఎలా అమలులోకి వస్తుంది వీటి మీద అవగాహన ఉంటే శాశ్వతం అన్న మాటకు ఎక్కడా తావు అన్నది ఉండదు, ఎందుకంటే మన రాజ్యాంగాన్నే ఎన్నో సార్లు సవరణ చేసుకున్న సంగతి విధితమే. ఇక ఎక్కడైనా ప్రజాభిప్రాయం ముఖ్యం. ప్రజలు కోరుకున్నారని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసే చట్టాలతో అనేక మార్పులు వస్తాయి. ఇపుడు అమరావతి ఏపీకి ఏకైక రాజధాని శాశ్వత రాజధాని అంటే ప్రస్తుతానికే అని అంటున్నారు జీవీ రెడ్డి. ఎవరీ జీవీ రెడ్డి అంటే ఈయన న్యాయవాదిగా అనుభవం ఉన్న వారు, టీడీపీలో చేరి కొన్నాళు పనిచేశారు. ఇపుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అమరావతి రాజధాని గురించి తాజాగా చేసిన ట్వీట్ అయితే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది.
ఒక సిఫార్సు మాత్రమే :
అవును ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయంగా ఒక సిఫార్సుగా కేంద్రానికి అమరావతిని రాజధానిగా చేయమని పంపించింది. దానికి కేంద్రం పార్లమెంట్ లో పెట్టి ఆమోదిస్తుంది. అలా అమరావతి ఏపీకి రాజధానిగా నోటిఫై చేస్తారు. మరి ఇది శాశ్వతమేనా అంటే అక్కడే రాజ్యాంగపరమైన న్యాయపరమైన అంశాలను తరచి చూడాల్సిన అవసరం ఉంది. అదెలా అంటే ఒక అసెంబ్లీ అమరావతిని రాజధాని అని కేంద్రాన్ని కోరింది. రేపు మరో పార్టీ వచ్చి మరో చోట రాజధాని అంటే దానికి కూడా పార్లమెంట్ తీర్మానం ఆమోదిస్తుంది కదా. ఇది పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతుంది కదా అన్నదే చర్చ. దానినే జీవీ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తుతానికే అని అంటున్నారు.
అధికారం పార్లమెంట్ కే :
అవును ఈ దేశంలో ఏ చట్టాన్ని అయినా సవరించే అధికారం కేవలం పార్లమెంట్ కే ఉంటుంది ఈ రోజున ఒక ప్రతిపాదనలో తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించినపుడు చట్ట సవరణ చేసి అమరావతి ఏపీ రాజధాని అని పేరు చేర్చినపుడు అదే పార్లమెంట్ కి రేపు మరో ప్రాంతం రాజధానిగా అని చట్ట సవరణ చేసి పేరు మార్చే అధికారం ఎందుకు ఉండదు, కచ్చితంగా ఉంటుంది. ఇదే విషయం జీవీ రెడ్డి చెబుతున్నారు. అందుకే ఆయన అంటున్నది ఏంటి అంటే రేపు మరో ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి రాజధానిని మరో చోటకు మారుస్తూ ప్రతిపాదిస్తే దానికి కూడా కేంద్రం అంగీకరిస్తే కచ్చితంగా చట్టాన్ని సవరించవచ్చు అని అంటున్నారు. అందువల్ల ఇది శాశ్వతమైన వ్యవహారం కాదని ఆయన చెబుతున్నారు.
రాజ్యాంగ సవరణ :
అందుకే దీనికి శాశ్వత పరిష్కారం రాష్ట్రాలు చేసే తీర్మానాలలో లేవు, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారానే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయగలమని ఆయన అంటున్నారు. అదెలా అంటే భారత రాజ్యాంగంలో రాజధాని హోదాకు సంబంధించిన అంశాన్ని పెట్టి అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానులు అన్నవి మార్చేందుకు వీలు లేదని కనుక రాజ్యాంగ సవరణ చేస్తే అపుడు ఏ ఇబ్బంది ఉండదు అని జీవీ రెడ్డి సలహా ఇస్తున్నారు.
ఏపీ వల్లనే అలా :
ఇక్కడ చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధానుల మార్పు అన్నది లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తూ పోతున్నారు. కానీ ఏపీలో వింత పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇపుడు రాజధానుల అంశం మీదనే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అనివార్యత వస్తోంది అని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అంటే అది చిన్న విషయం కాదని జీవీ రెడ్డి అంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఏ సవరణకైనా పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీ ఉండాలని ఆయన చెబుతున్నారు. ఇక రాజధానులు అన్నవి రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక రాష్ట్రాల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. దాంతో సగం రాష్ట్ర అసెంబ్లీలలో కూడా రాజ్యాంగ సవరణకు ఆమోదం కావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. అలా కనుక రాజ్యాంగ సవరణ చేస్తే అపుడు ఎవరూ రాజధానులను మార్చడం అన్నది చేయలేరని అంటున్నారు. అయితే రాజధానుల విషయంలో రాజ్యాంగ సవరణకు వీలు ఉంటుందా ఆ దిశగా ప్రతిపాదనలు ఏమైనా వస్తాయా అన్నది చూడాల్సి ఉంది.