అమరావతి అగ్ని కీలలపై ‘సిట్’.. కుట్ర కోణంలోనే దర్యాప్తు!
రాజధాని అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది.;
రాజధాని అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. ఈ విషయంలో అసలు వాస్తవాలు నిగ్గుతేల్చాలని భావిస్తోంది. 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు అగ్నిప్రమాదాలు జరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటనకు దారితీసిన పరిణామాలను తెలుసుకునేందుకు పది మంది పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఒక ఏఎస్పీతోపాటు డీఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు ఈ బృందంలో ఉన్నారు.
అమరావతి నిర్మాణ పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా కుట్రతో మంటలు పుట్టిస్తున్నారా? అన్న కోణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సహజంగా మంటలు చెలరేగి పైపులు కాలిపోయే పరిస్థితి ఉండదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైపులు కాలిపోవాలంటే 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలని అంటున్నారు. సాధారణంగా మంటలు చెలరేగి ఒకేసారి పెద్ద ఎత్తున కాలిపోవడం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని పనులలో జాప్యం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైనా కావాలని మంటలు పుట్టిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ప్రభుత్వం ఈ విషయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. మంటలు వ్యాపించడానికి కారణాలుతోపాటు ఎవరైనా కుట్ర చేస్తే, వారెవరు అన్న విషయాన్ని గుర్తించాలని సిట్ పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ ఘటనపై రాజధాని పరిధిలోని తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తుళ్లూరు పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది. ఇక ఈ సిట్ కు గుంటూరు ఏఎస్పీ రవికుమార్ నేతృత్వం వహించనున్నారు. ఆయన టీంలో డీఎస్పీతో సహా మరో 8 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది.
ఇక సిట్ ఏర్పాటుతోపాటు నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలను పెంచాలని ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలకు సూచనలు జారీ చేసింది. నిర్మాణ సామగ్రి నిల్వ చేసిన చోట సెక్యూరిటీని నియమించడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. మరోవైపు ప్రభుత్వం సైతం డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇకపై నిరంతరాయంగా పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.