అమరావతికి వచ్చి చూడండి.. నారాయణ సవాల్

సీఆర్డీఏ పరిధిలో ఇంకా 1,800 ఎకరాల భూమి సమీకరణ జరగాల్సి ఉందని తెలిపారు. రైతులు సహకరిస్తే మరింత లాభం పొందుతారని, అవసరమైతే భూ సేకరణ మార్గంలో కూడా ముందుకు వెళ్తామని వెల్లడించారు.;

Update: 2025-09-03 10:06 GMT

అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఎలాంటి విషప్రచారాలకు లోను కాకుండా ప్రజలు స్వయంగా వచ్చి చూసి తెలుసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తూ అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు.

రాజధాని అత్యంత సురక్షితం

అమరావతి అత్యంత సురక్షిత నగరమని మంత్రి నారాయణ తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగులను విస్తరిస్తూ మూడు రిజర్వాయర్లు నిర్మాణం పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని వివరించారు. “వాగుల్లోని అడ్డంకులను తొలగించాం. ఇకపై ఎంత పెద్ద వర్షం వచ్చినా అమరావతిలో నీరు నిలిచే అవకాశం లేదు,” అని స్పష్టం చేశారు.

భూ సమీకరణపై స్పష్టత

సీఆర్డీఏ పరిధిలో ఇంకా 1,800 ఎకరాల భూమి సమీకరణ జరగాల్సి ఉందని తెలిపారు. రైతులు సహకరిస్తే మరింత లాభం పొందుతారని, అవసరమైతే భూ సేకరణ మార్గంలో కూడా ముందుకు వెళ్తామని వెల్లడించారు.

- నిర్మాణ పనుల పురోగతి

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ 52వ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించినట్లు మంత్రి వివరించారు. అమరావతిలో సీఆర్డీఏ భవనం నిర్మాణ పనులు ఈ నెలాఖరుకే పూర్తవుతాయని తెలిపారు. ఈ భవనం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుండగా, పక్కనే 1.60 లక్షల చదరపు అడుగుల అనుబంధ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దసరా సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

2014–19 మధ్య ఈ నిర్మాణం పూర్తయినా, తరువాతి ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించారు. “మళ్లీ టెండర్లు పిలిచి మిగిలిన పనులు పూర్తి చేస్తూ, అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తున్నాం,” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

ఉద్యోగుల నివాసాలు.. వచ్చే మార్చికి సిద్ధం

ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవన సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. మూడేళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు.

అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. “అమరావతి అభివృద్ధి పనులు కళ్లముందే జరుగుతున్నాయి. విషప్రచారం చేసే వారు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి మాట్లాడాలి,” అని హితవు పలికారు.

Tags:    

Similar News