వైసీపీలో అదే గందరగోళం.... బూమరాంగ్ అవుతుందా ?

ఏపీకి అమరావతి రాజధానిని చట్టబద్ధం చేయాలని కోరుతూ ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం కీలకమైన తీర్మానాన్ని ఆమోదించింది.;

Update: 2026-04-01 03:30 GMT

ఏపీకి అమరావతి రాజధానిని చట్టబద్ధం చేయాలని కోరుతూ ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం కీలకమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఇక దీని మీద కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. దాంతో తొందరలోనే చట్టబద్ధత రానుంది. ఏపీ ప్రజలంతా చూసినా అమరావతినే ఏకైక రాజధానిగా భావిస్తూ 2024 ఎన్నికల్లో ముక్త కంఠంతో నినదించారు. తమ ఓటు ద్వారా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. అయితే ఏపీలో ప్రధాన రాజకీయం పక్షం అయిన వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు అన్నీ అమరావతి రాజధాని విషయంలో జై కొడుతున్నాయి.

ఒక విధానం అంటూ :

ఇక అమరావతి వంటి కీలక అంశం, రాష్ట్రానికి రాజధాని అయిన దాంట్లో వైసీపీ ఇంకా అదే గందరగోళంలో ఉందా అన్న చర్చ సాగుతోంది. అమరావతి మీద వైసీపీ నేతలు సీనియర్లు మాజీ మంత్రులూ తలో మాట అంటూండడం తోనే ఈ ఇష్యూ మీద వైసీపీకి క్లారిటీ లేదా అన్న చర్చ వస్తోంది. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల విషయంలో అవినీతి చోటు చేసుకుందని దాని మీదనే మాట్లాడుతున్నామని అన్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే అసెంబ్లీలో తీర్మానం పెట్టి మండలిలో పెట్టలేదని విమర్శించారు. రాజ్యాంగాన్నే మార్చుకుంటున్నామని చట్టాలు మార్చలేరా అన్నట్లుగా కూడా ఆయన కామెంట్స్ చేశారు.

ఇరకాటమేనా :

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అయితే అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మద్రాస్ నుంచి కర్నూల్ హైదరాబాద్ అమరావతి ఇలా ఎన్ని రాజధానులు మారలేదని ధర్మాన అంటే పరిపాలనా వికేంద్రీకరణ అంటూ బొత్స పాత పాటనే పాడడంతో వైసీపీకి ఈ వ్యాఖ్యల వల్ల ఇరకాటమే అని అంటున్నారు. వివిధ ప్రాంతాలలో సమస్యలు వేరు, అలాగే ప్రాంతీయంగా ఉండే ఆకాంక్షలు వేరు, రాజధాని విషయంలో వీటికి ముడి పెట్టడం భావ్యం కాదని మేధావులు అంటున్నారు. ఇక వైసీపీ మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు అయితే కౌంటర్లు ఇస్తున్నారు. అమరావతి విషయంలో వైసీపీ ఇంకా అలాగే ఆలోచిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సైలెంట్ గా ఉంటేనే :

అమరావతి రాజధాని అన్నది అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఫిక్స్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల భావాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తేనే పండుతుంది. ఇక ప్రాంతీయ సెంటిమెంట్లను గౌరవించడం తప్పు కాదు కానీ రాజధాని విషయంలో మాత్రం అది కూడదని అంటున్నారు. వైసీపీ ఇప్పటికైనా రాజధాని విషయంలో సైలెంట్ గా ఉంటే మేలు అంటున్నారు. లేకపోతే అమరావతికి మేము అనుకూలమే అని ఒక్క మాట చెప్పినా రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా ఉంటుందని అంటున్నారు. అది కాకుండా ఇంకా అమరావతి మీద విమర్శలు చేస్తూ పోతే అది బూమరాంగ్ అయి వైసీపీకే ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News